
గణేశ్ ఉత్సవాలకు పటిష్ట భద్రత
జగిత్యాలక్రైం: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని విగ్రహాల ఏర్పాట్లలో ఎలాంటి అపశృతి జరగకుండా విద్యుత్, పోలీసు శాఖల ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు చేపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా వినాయక మండపాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వినాయక విగ్రహాలు తరలిస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు, కేబుల్ వైర్లుగానీ కదలకుండా చూసుకోవాలని, శబ్ద కాలుష్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీజే నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నారు.
546 మంది బైండోవర్
గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా పూర్తయ్యేలా పోలీసులు డీజే నిర్వాహకులు, రౌడీషీటర్లు, అనుమానితులు, నిత్యం గొడవలు సృష్టించేవారు, మత విద్వేషాలను రెచ్చగొట్టే వారు ఆయా మండలాల పరిధిలోని 546 మందిని తహసీల్దార్ల ముందు బైండోవర్ చేశారు.
మండపాలకు అనుమతులు తప్పనిసరి
మండపాల నిర్వాహకులు పోలీసు శాఖ తీసుకొచ్చిన వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను తప్పనిసరి చేశారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న వినాయక మండపాలను గుర్తించి వాటిని జియో ట్యాగింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఏదైనా సమస్య తలెత్తితే సత్వరమే అక్కడకు చేరుకునేలా పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది.
పటిష్ట చర్యలు
గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకొనేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. శాంతిభద్రతల పరిరక్షణకు మండప నిర్వాహకులు ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. ఇప్పటికే నిర్వాహకులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాం. వారికి అవగాహన కల్పించాం.
– అశోక్‌కుమార్, ఎస్పీ