
అందేఎత్తులోనే విద్యుత్ వైర్లు
కోరుట్ల: వినాయక విగ్రహాల ఎత్తు పెంపుతోపాటు విద్యుత్, కేబుల్ వైర్లు సరైన రీతిలో లేకపోవడంతో ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. విద్యుత్ వైర్లను సరిచేయడంలో ట్రాన్స్‌కో అధికారులు.. కేబుల్ వైర్లను బాగుచేయడంలో ఆపరేటర్లు కొన్ని చర్యలు తీసుకుంటున్నా.. పూర్తిస్థాయిలో తొలగించడం లేదు. మరోవైపు ఎత్తైన వినాయక విగ్రహాలను నెలకొల్పుతుండడంతో వాటిని తరలించేటప్పుడు ఇబ్బందులు కలుగుతున్నాయి.
ఉత్సవాలు ఘనంగా జరపాల్సిందే..
వినాయకుడిని భక్తి ప్రపత్తులతో కొలవడం మన ఆనవాయితీ. నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించడం సంప్రదాయం. నిమజ్జనం కూడా అట్టహాసంగా చేయడమూ ఆచారమే. ఇదంతా బాగానే ఉందిగానీ.. వినాయక విగ్రహాలను పరిమితి లేకుండా పెద్దగా తయారుచేయడం.. ఫలితంగా జరుగుతున్న ఆకస్మిక ప్రమాదాలు పండుగ వాతావరణంలో కలకలం రేపుతున్నాయి. జిల్లాలో ఏటా వినాయక చవితి సందర్భంగా ఎంత తక్కువ అనుకున్నా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలతోపాటు ఇతర గ్రామాల్లో సుమారు 2500 వినాయక మండపాలు నెలకొల్పుతారు.
వీటిలో దాదాపు 1200 వరకు భారీ సైజులో ఉన్న వినాయకులను ప్రతిష్ఠిస్తారని అంచనా. వినాయక మంటపాలకు కరెంటు సరఫరా కోసం చార్జీలు వసూలు చేస్తున్న ట్రాన్స్‌కో అధికారులు.. అందులో వాడుతున్న విద్యుత్ వైర్లు, వాటికి అనుబంధంగా ఉంచుతున్న జీ వైర్లు, డీజేలకు ఇచ్చే కనెక్షన్లపై కొంత దృష్టి సారిస్తే బాగుంటుందని, మంటపాల నిర్వాహకులకు అవగాహన కల్పిస్తే ప్రమాదాల నియంత్రణకు అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నియంత్రణ ఏదీ..?
వినాయక విగ్రహాల తయారీ కేంద్రాల్లో కోరుట్ల కీలకమైంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని అనేక ప్రాంతా లకు కోరుట్ల వినాయక విగ్రహాలు తరలివెళ్తాయి. ఎంత తక్కువ అనుకున్నా ఇక్కడ సుమారు రూ.5కోట్ల వరకు టర్నోవర్ ఉంటుంది. కోరుట్లలో చాలామందికి వినాయక విగ్రహాల తయారీ పరి శ్రమ ఉపాధి కల్పిస్తోంది. తయారీదారులు కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా మండపాల నిర్వాహకుల భద్రతపైనా కాస్త దృష్టి సారించాల్సిన అవసరముంది. వినాయక విగ్రహాల ఎత్తు విషయంలో తమకు తామే కొంత పరిమితి పెట్టుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరోనా సమయంలో కేవలం 5 ఫీట్లకు మించి వినాయక విగ్రహాలు తయారు చేయరాదని అధికారులు నియంత్రించారు. ఆ తరువాతి కాలంలో మళ్లీ ఎప్పటిలాగే 20 నుంచి 25 ఫీట్లు ఉన్న వి నాయక విగ్రహాల తయారీ కొనసాగుతోంది. వీటికి వినాయక మండపాల నిర్వాహకుల్లో క్రేజ్ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విగ్రహాల తయారీదారులు స్వీయ నియంత్రణ పాటిచాల్సిన అవసరముందన్న చర్చ సాగుతోంది. దీనికితోడు విద్యుత్ శాఖ అధికారులు, కేబుల్ ఆపరేటర్లు కూడా వినాయక నిమజ్జనానికి ముందుగానే వైర్లను సరిచేస్తే ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఉత్సవాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే అవకాశం ఉంది.