
గణేశ్ ఉత్సవాలకు భద్రత కల్పించాలి
● ఎస్పీ అశోక్‌కుమార్
జగిత్యాలక్రైం: గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకునేలా భద్రత కల్పించాలని ఎస్పీ అశోక్‌కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలో గురువారం డీఎస్పీలు, సీఐలతో సమీక్షించారు. గణేశ్ ఉత్సవాల్లో పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిర్వాహకులతో సీఐలు, ఎస్సైలు ముందుగానే సమావేశాలు ఏర్పాటు చేసి సమీక్షించాలని, శాంతిభద్రతల సమస్య ఎక్కడా రానివ్వొద్దని సూచించారు. శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని, విషయాన్ని నిర్వాహకులు, కమిటీలకు వివరించాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు. అవాస్తవాలను ఎవరూ నమ్మవద్దన్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల సైబర్ డీఎస్పీ వెంకటరమణ అన్నారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ కోరుట్లకు చెందిన ఓ వ్యక్తి నుంచి బిజినెస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రేడింగ్ పేరుతో రూ.53 లక్షలను సైబర్ నేరగాళ్లు మోసం చేశారని, జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.21 లక్షలు కాజేశారన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కోరుట్ల సీఐ సురేశ్, బుగ్గారం ఎస్సై సతీశ్, సైబర్ క్రైమ్ ఎస్సైలు కృష్ణ, దినేశ్‌కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించామని, నిందితుల బ్యాంక్ ఖాతాలను గుర్తించి వారు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నామని తెలిపారు. ముగ్గురు నిందితులు కోల్‌కత్తాలోని ఓ ముఠా ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. బెంగళూరులోని యేలహంక ప్రాంతానికి చెందిన నాగేంద్రప్రసాద్ తన స్నేహితుడు అన్వర్, కోల్‌కత్తా గ్యాంగ్ సభ్యులతో కలిసి బిజినెస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రేడింగ్ పేరుతో మోసం చేస్తున్నారని, ఇలా వచ్చిన డబ్బులను ఇతర ఖాతాలకు బదిలీ చేసినట్లు వెల్లడైందన్నారు. నిందితుడిపై దేశవ్యాప్తంగా ఎన్సీఆర్టీ పోర్టల్‌లో 71 కేసులు నమోదయ్యాయని, నిందితుని నుంచి మొబైల్ ఫోన్, బ్యాంక్ అకౌంట్స్, బుక్స్, చెక్‌బుక్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే కేసులో సంబంధమున్న బెంగళూరుకు చెందిన యోగేశ్ కదం, సునిల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
నిర్వాహకులు నిబంధనలు పాటించాలి
మెట్‌పల్లి: వినాయక మంటపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని డీఎస్పీ రాములు సూచించారు. పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో నిర్వాహకులతో సమావేశమయ్యారు. ట్రాఫిక్, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా మండపాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్ మోహన్, తహసీల్దార్ నీతా, సీఐ అనిల్‌కుమార్, ఎస్సై కిరణ్‌కుమార్ ఉన్నారు.