Attack On UAE: ఉరిమి ఉరిమి.. యూఏఈ నెత్తిన! ఎందుకిలా జరుగుతోంది?

Yemen Houthi Missile Targets Saudi Arabia And UAE Escalation Grows - Sakshi

హౌతీ రెబెల్స్‌కు టార్గెట్‌గా మారిన యూఏఈ 

సౌదీ కూటమిలో చేరిన ఫలితం 

వైదొలగాలన్న యోచనలో యూఏఈ నాయకత్వం 

బలమైన శత్రు కూటమిని నేరుగా ఎదుర్కొని విచ్ఛిన్నం చేయడం అంత ఈజీ కాదు. అదే కూటమిలో ఒక భాగస్వామి నాకెందుకీ తలనొప్పి అనుకునేలా చేయగలిగితే తప్పక కూటమిలో చీలికలు వస్తాయి. ఈ సూత్రాన్నే ప్రస్తుతం హౌతీ రెబెల్స్‌ అనుసరిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా పోరాడుతున్న సౌదీ కూటమి నుంచి యూఏఈ వైదొలిగేలా చేసేందుకు ఆ దేశాన్ని టార్గెట్‌గా చేసుకొని దాడులు చేస్తున్నారు. తిరుగుబాటుదారుల ప్లాన్‌ వర్కవుట్‌ అవుతుందో లేదో కాలమే చెప్పాలి.. 

కొన్ని వారాలుగా యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు యూఏఈని లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారు. నిజానికి హౌతీ రెబెల్స్‌ ప్రధాన టార్గెట్‌ సౌదీ అరేబియా, కానీ సౌదీ లాంటి దేశాన్ని నేరుగా ఎదుర్కోలేక పక్కనే ఉన్న యూఏఈపై ప్రతాపం చూపేందుకు తిరుగుబాటుదారులు యత్నిస్తున్నారు. దీంతో మంచికి పోతే చెడు ఎదురైందన్నట్లు యెమెన్‌ విషయంలో జోక్యం చేసుకున్నందుకు యూఏఈకి ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పటికే యెమెన్‌ యుద్ధం వల్ల వేలాదిమంది మరణించారు, కానీ ఈ సమస్య రావణ కాష్టంలా రగులుతూనే ఉంది.

2014లో ఆరంభమైన ఈ అతర్యుద్ధంలో యెమెన్‌ కీలుబొమ్మ ప్రభుత్వానికి పాశ్చాత్య దేశాల అండ ఉన్న సౌదీ కూటమి మద్దతునిస్తుండగా, హౌతీ రెబెల్స్‌కు ఇరాన్‌ అండ ఉంది. 2014లో తిరుగుబాటుదారులు యెమెన్‌ రాజధానిని ఆక్రమించుకున్నారు. దీన్ని ఇష్టపడని సౌదీ కూటమి 2015లో నామమాత్ర ప్రభుత్వానికి నేతగా ఉన్న అబెద్‌ రబ్బో మన్సూర్‌ హదికి మద్దతుగా నేరుగా యుద్ధంలోకి దిగింది. ఇప్పటికి ఆరంభమై ఏడేళ్లైనా ఈ అంతర్యుద్ధం కొలిక్కి రాలేదు. దీంతో తిరుగుబాటుదారులపై ఒత్తిడి పెంచేందుకు వారిపై ఉగ్రముద్ర వేయాలని యూఎస్‌ భావిస్తోంది. యూఏఈపై దాడులు జరిపి ఆ దేశ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి సౌదీ కూటమి నుంచి తనంతతానే యూఏఈ వైదొలిగేలా చేయాలని రెబెల్స్‌ భావిస్తున్నారు. 

యూఏఈపై కోపం ఎందుకు? 
యెమెన్‌ అంతర్యుద్ధంలో తాము వెనుకంజ వేయడానికి యూఏఈ కారణమని హౌతీ రెబల్స్‌ ఆగ్రహిస్తున్నారు. యూఏఈ జోక్యంతో తమకు యెమెన్‌ ఉత్తరదిశలో భారీగా ఎదురుదెబ్బలు తగిలాయని, దీంతో రాజధానిపై పట్టు పోయిందని తిరుగుబాటుదారులు భావిస్తున్నారు. గతేడాది యెమెన్‌లో కీలకమైన మరిబి నగరాన్ని తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు తిరుగుబాటుదారులు యత్నించారు. వీరి ప్రయత్నాలు దాదాపు ఫలవంతమయ్యే దశకు వచ్చాయి. ఈ సమయంలో యూఏఈకి చెందిన జెయింట్‌ బ్రిగేడ్‌ సైనికులు రంగంలోకి దిగడంతో పరిస్థితి మారిపోయింది.

ఈ బ్రిగేడ్‌ తిరుగుబాటుదారులు ఆధీనంలోని షబ్వా నగరాన్ని స్వాధీనం చేసుకుంది. దీంతో తిరుగుబాటుదారులకు నిత్యవసరాల రాకపోకలు ఆగిపోయి మరిబి నగర స్వాధీనం కుదరలేదు. ఇది యూఏఈపై తిరుగుబాటుదారులు ఆగ్రహం ప్రజ్వరిల్లేందుకు దోహదం చేసింది. అప్పటినుంచి వీలున్నప్పుడల్లా యూఏఈపై దాడులకు తిరుగుబాటుదారులు యత్నిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా డ్రోన్‌ దాడులు, మిసైల్‌ దాడులను ముమ్మరం చేశారు. తిరుగుబాటుదారులు దాడులు యూఏఈ పర్యాటక, వ్యాపార వాతావరణంపై ప్రభావం చూపుతున్నాయి.

దీంతో ఈ యుద్ధం నుంచి బయటపడాలని యూఏఈ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సౌదీ కూటమి నుంచి యూఏఈ వైదొలిగేలా చేసేందుకే తిరుగుబాటుదారులు తరుచూ యూఏఈ భూభాగాన్ని టార్గెట్‌గా చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అన్ని పక్షాలతో సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారం కనుగొనాలని పాశ్చాత్య దేశాలు యత్నిస్తున్నా ఫలితం దక్కడం లేదు. ముఖ్యంగా తిరుగుబాటుదారులు యూఎస్‌ను నమ్మడం లేదు. ఇరాన్‌ జోక్యం చేసుకొని మధ్యవర్తిత్వం జరిపితే పరిస్థితిలో మార్పు ఉం డొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదిరేలోపు ఈ అంతర్యుద్ధంలో యెమెన్‌ ప్రజానీకం సమిధలవడమే అసలైన విషాదం.            
 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top