కోవిడ్‌ కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన!

WHO Chief Says Very Concerned Over Evolving Situation In China - Sakshi

జెనీవా: చైనాలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బీఎఫ్‌.7 విజృంభణతో వచ్చే మూడు నెలల్లో దేశ జనాభాలోని 60 శాతం మంది వైరస్‌బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్‌ వేగంగా వ్యాప్తి చెందడం తీవ్ర ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని చైనాకు సూచించారు. వైరస్‌ బారినపడే అవకాశం ఉన్న వారికి ముందు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వారాంతంలో నిర్వహించే మీడియో సమావేశంలో కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు.  

‘కోవిడ్‌ విజృంభణతో చైనాలో తలెత్తుతున్న పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతోంది. వ్యాధి వ్యాప్తి తీవ్రత, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య, ఐసీయూల అవసరం వంటి వివరాలు సమర్పించాలి. దేశవ్యాప్తంగా వైరస్‌ బారినపడేందుకు ఎక్కువ అవకాశం ఉన్నవారికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు డబ్ల్యూహెచ్‌ఓ మద్దతుగా నిలుస్తుంది. క్లినికల్‌ కేర్‌, ఆరోగ్య వ్యవస్థ భద్రతకు మా మద్దతు కొనసాగుతుంది.’

- డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌

2020 నుంచి కఠిన ఆంక్షలు విధిస్తూ వస్తోంది చైనా. జీరో కోవిడ్‌ పాలసీని అవలంభిస్తోంది. అయితే, ప్రజాగ్రహంతో ఎలాంటి ప్రకటన చేయకుండానే డిసెంబర్‌ తొలినాళ్లలో ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది బీజింగ్‌ ప్రభుత్వం. దీంతో ఒక్కసారిగా కేసులు పెరిగిపోయాయి. పరిస్థితులు తీవ్రంగా మారడంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో భారత్‌ అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఇదీ చదవండి: Lockdown: కరోనా కొత్త వేరియంట్‌.. మళ్లీ లాక్‌డౌన్‌ తప్పదా? ఇదిగో క్లారిటీ..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top