మేం మంచివాళ్లం.. ఇరాన్‌కు వారం సెలవిచ్చాం | Trump’s ‘We Gave Iran a Week Off’ Remark During US Independence Day Speech Sparks Global Debate, Check More Details | Sakshi
Sakshi News home page

మేం మంచివాళ్లం.. ఇరాన్‌కు వారం సెలవిచ్చాం

Jul 4 2026 9:33 AM | Updated on Jul 4 2026 12:10 PM

We Are Nice Gave Iran a Week Off: Trumps Remark Sparks Buzz

ఇరాన్‌లో మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి జరుగుతున్న వీడ్కోలు కార్యక్రమాల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మౌంట్ రష్‌మోర్ వద్ద జరిగిన భారీ సభలో ఆయన చేసిన సెటైరికల్ వ్యాఖ్యలు వివాదంగా మారాయి.

“మేం మంచివాళ్లం కాబట్టి ఇరాన్‌కు ఒక వారం సెలవిచ్చాం” అంటూ ట్రంప్ ప్రసంగించారు. అంతకుముందు ఇరాన్‌పై జరిగిన సైనిక చర్యలను ప్రస్తావిస్తూ ఆయన “మేం ఇరాన్‌ను గట్టిగా దెబ్బకొట్టాం… వాళ్లు చర్చలకు సిద్ధంగా ఉన్నారు” అని వ్యాఖ్యానించారు.

మేము వెనెజువెలాను ఒక రోజులోనే ఓడించాం. ఇరాన్‌ను కూడా తీవ్రంగా దెబ్బతీశాం. వాళ్లు ఇప్పుడు ఒప్పందానికి రావడానికి ఎంతో తహతహలాడుతున్నారు. మేము మంచివాళ్లం కాబట్టి వారికి అంత్యక్రియల కోసం ఒక వారం సమయం ఇచ్చాం. వీలైనంత త్వరగా వాళ్లు మాతో డీల్‌ కుదుర్చుకుంటే మంచిది అని అన్నారాయన.

ట్రంప్‌ వ్యాఖ్యలను సభలో ఉన్నవాళ్లు చప్పట్లు, నవ్వులతో స్వాగతించారు. ప్రస్తుతం.. అమెరికా అంతటా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.

ఇక మరోవైపు ఇరాన్‌లో సంతాప దినాలు నడుస్తున్నాయి. రాజధాని టెహ్రాన్‌లో గ్రాండ్ మోసల్లా కేంద్రంగా ఖమేనీకి వీడ్కోలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వేలాది మంది ప్రజలు నల్ల దుస్తుల్లో హాజరై కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఘలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు.. ‘‘అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలి.. ట్రంప్‌ను హతమార్చాలి’’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు, ఫ్లకార్డులు ఆ కార్యక్రమంలో కనిపించడం గమనార్హం. 

ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం సాధారణంగా 24 గంటల్లో అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, యుద్ధ పరిస్థితులు, భద్రతా కారణాల వల్ల ఇంతకాలం వాయిదా వేస్తూ వచ్చారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ సంతాప యాత్రలో ఖమేనీ పార్థివదేహాన్ని ఖోమ్, నజాఫ్, కర్బలా మీదుగా మష్హద్‌కు తరలించి జూలై 9న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు భారత్, పాకిస్థాన్, రష్యా, చైనా సహా అనేక దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. 

ఇరాన్‌లో శోక వాతావరణం కొనసాగుతున్న సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్‌ దీనికి ఎలా స్పందిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఉద్రిక్తతల కారణంగా.. అమెరికా–ఇరాన్ సంబంధాల్లో కొత్త రాజకీయ దుమారానికి కారణమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement