టిక్‌టాక్ : రేసులో మరో దిగ్గజం

Walmart joins Microsoft bid for TikTok US operations - Sakshi

టిక్‌టాక్‌ డీల్, మైక్రోసాఫ్ట్‌తో వాల్‌మార్ట్ జత

వాషింగ్టన్ : చైనా సోషల్ మీడియా దిగ్గజం టిక్‌టాక్ అమెరికా బిజినెస్ కు సంబంధించి మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. టిక్‌టాక్  కొనుగోలు రేసులో మరో దిగ్గజం వాల్‌మార్ట్  చేరింది. మైక్రోసాఫ్ట్  సంస్థతో కలిసి టిక్‌టాక్  కొనుగోలు ఒప్పందాన్ని చేసుకోనున్నామని వాల్‌మార్ట్ తాజాగా ప్రకటించింది. పదవిలో చేరిన మూడు నెలల కాలంలోనే టిక్‌టాక్  సీఈఓ కెవిన్ మేయర్ రాజీనామా చేసిన గంటల అనంతరం వాల్‌మార్ట్   ఈ ప్రకటన చేయడం గమనార్హం. (చదవండి టిక్‌టాక్‌ సీఈవో కెవిన్‌ రాజీనామా)

టిక్‌టాక్‌ విక్రయానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ విధించిన గడువు సెప్టెంబర్ 15 లోగా ఒప్పందాన్ని పూర్తి చేయాలని టిక్‌టాక్ యజమాన్య సంస్థ బైట్‌డాన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో బిడ్డర్లతో ప్రత్యేక చర్చలు జరపనుందని రాయిటర్స్‌ నివేదించింది. అయితే ఈ అంచనాలపై వ్యాఖ్యానించడానికి బైట్‌డాన్స్ నిరాకరించింది. అమెరికాలోని టిక్‌టాక్ విభాగం కొనుగోలుకు టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతోంది. మరోవైపు టిక్‌టాక్‌ కొనుగోలుకు ఒరాకిల్ గ్రూప్ అయితే బావుంటుందని ట్రంప్ ఇటీవల హింట్ ఇచ్చారు.  ఈ వైపుగా ఒరాకిల్ చర్చల్లో ఉన్నట్టు సమాచారం.  (టిక్‌టాక్‌ : ట్రంప్ మరో ట్విస్టు)

కాగా జాతీయ భద్రతకు ముప్పు, అమెరికా యూజర్ల సమాచారాన్ని చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందంటే ట్రంప్ టిక్‌టాక్‌పై తీవ్రంగా మండిపడున్నారు. అమెరికాలోని టిక్‌టాక్‌ వ్యాపారాన్ని అమెరికాలోని ఏదేని సంస్థకు విక్రయించాలని లేదంటే నిషేధం తప్పదని టిక్‌టాక్‌ను హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్  ఆదేశాలపై సంతకం కూడా చేసిన ఆయన విక్రయానికి సమయాన్నిచ్చారు. మరోవైపు భారత చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం టిక్‌టాక్‌ సహా చైనా యాప్ లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top