అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు తన నోబెల్ శాంతి బహుమతిని అందజేశారు వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో. గురువారం వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో ట్రంప్‌నకు తన నోబెల్ శాంతి బహుమతి మెడల్‌ను అందజేసినట్లుగా ఆమె తెలిపారు.
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ దేశ రాజకీయ భవిష్యత్తుపై తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. గంటకు పైగా సాగిన సమావేశం తర్వాత మచాడో వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆమెకు మద్దతుదారులు ఉత్సాహంగా స్వాగతం పలికారు. “మనం అధ్యక్షుడు ట్రంప్‌పై ఆధారపడవచ్చు” అని ఆమె పేర్కొన్నారు. అనంతరం “థ్యాంక్ యూ, ట్రంప్” అంటూ నినాదాలు చేయించారు.
అయితే ఆమె సమర్పించిన నోబెల్ పతకాన్ని ట్రంప్ స్వీకరించారా లేదా అనే ప్రశ్నకు మచాడో సమాధానం ఇవ్వలేదు. ఈ చర్యపై గత కొన్ని వారాలుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే నోబెల్ శాంతి బహుమతి బదిలీ చేయడం లేదా ఇతరులకు అందజేయడం సాధ్యం కాదని నోబెల్ అవార్డుల నిబంధనలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. నార్వేజియన్ నోబెల్ ఇన్‌స్టిట్యూట్ కూడా ఈ విషయాన్ని పునరుద్ఘాటించింది.


