లైంగిక వేధింపులు.. రూ.7 వేల కోట్లకు సెటిల్‌మెంట్‌

USA  University To Pay Over 1 Billion Dollars In Gynecologist Molestation Abuse Settlement - Sakshi

సివిల్‌ లిటిగేషన్‌ చరిత్రలో భారీ సెటిల్‌మెంట్‌

సౌత్‌ కాలిఫోర్నియా యూనివర్సిటీ గైనకాలజిస్ట్‌పై  ఆరోపణలు

లాస్‌ ఏంజెలిస్‌‌: మాజీ క్యాంపస్ గైనకాలజిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వందలాది మంది మహిళలకు 1 బిలియన్ డాలర్లకు పైగా(7,246,00,00,000 రూపాయలు) చెల్లించడానికి కాలిఫోర్నియాలోని ఒక ఉన్నత విశ్వవిద్యాలయం అంగీకరించింది. ఈ విషయాన్ని బాధితుల తరఫు న్యాయవాది ఒకరు గురువారం మీడియాకు వెల్లడించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ కాలిఫోర్నియా(యూఎస్‌సీ) ఈ మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరిస్తున్నట్లు లాస్ ఏంజెలిస్‌ కోర్టుకు తెలిపింది. గతంలో 2018లో ఫెడరల్ క్లాస్ చర్య ఫలితంగా ఇప్పటికే 215 మిలియన్ డాలర్లు చెల్లించింది. ఈ సందర్భంగా న్యాయవాది గ్లోరియా ఆల్రెడ్ మాట్లాడుతూ.. ‘‘సివిల్‌ లిటిగేషన్‌ చరిత్రలో లైంగిక వేధింపుల కేసులో ఇంత భారీ మొత్తంలో చెల్లించడానికి అంగీకరించడం ఇదే ప్రథమం’’ అన్నారు. ఈ లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రబుద్ధుడు ఎవరు.. ఏంటి అనే వివరాలు.. 

జార్జి టిండాల్‌(74) అనే వ్యక్తి తన 30 ఏళ్ల సర్వీసులో వందల మంది మహిళలను లైంగిక వేదింపులకు గురి చేశాడు. వీరిలో మైనర్ల నుంచి మధ్య వయసు మహిళల వరకు ఉన్నారు. మెడికల్‌ చెకప్‌ కోసం వచ్చిన ఆడవారిని టిండాల్‌ లైంగికంగా వేధించేవాడు. రోగుల వ్యక్తిగత శరీర అవయాలను ఫోటోలు తీయడం.. ప్రైవేట్‌ పార్ట్స్‌ని తాకడం.. శరీరాకృతి గురించి చండాలమైన కామెంట్స్‌ చేయడం వంటివి చేసేవాడు. అంతేకాక యూనివర్సిటీలో ఎక్కువగా ఉన్న ఆసియా ఖండం విద్యార్థులను టార్గెట్‌ చేసి వేధింపులకు పాల్పడేవాడు. ఇలా సాగిపోతున్న ఇతడి అరాచకాల గురించి 1990లో మొదటి సారి ఓ టీనేజ్‌ యువతి ఫిర్యాదు చేయడంతో టిండాల్‌ బాగోతం వెలుగులోకి వచ్చింది. మెడికల్‌ చెకప్‌ కోసం వెళ్లిన తనను టిండాల్‌ అసభ్యకర రీతిలో తాకుతూ.. అత్యాచారం చేశాడని తెలిపింది.

ఈ టిండాల్‌పై వచ్చిన ఆరోపణలపై స్పందించడంలో విఫలమైనందుకు వేలాది మంది మాజీ రోగులు విశ్వవిద్యాలయంపై కేసు వేశారు. వైద్యుడి చర్యల గురించి సంస్థకు తెలుసని.. అయినప్పటికి అతడిపై చర్యలు తీసుకోకుండా సర్వీసులోనే కొనసాగించారని బాధితులు ఆరోపించారు. పైగా 2016 వరకు యూఎస్‌సీ అధికారులు టిండాల్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయలేదని.. ఈ విశ్వవిద్యాలయంతో ఉన్న స్నేహపూర్వక ఒప్పందం వల్ల టిండాల్‌ పదవీ విరమణ చేయడానికి అంగీకరించారని బాధితులు తెలిపారు. ఈ ఆరోపణలకు సంబంధించి యూఎస్‌సీ ఇప్పటికే 200,000 డాలర్టు(1,45,23,803 రూపాయలు) చెల్లించినట్లు తెలిసింది. "కొన్నిసార్లు అతడి వద్ద పరీక్షలకు హాజరైన నర్సులు టిండాల్‌ దుర్మర్గాలను ప్రత్యక్షంగా చూశారని’’ న్యాయవాది తెలిపారు. 

బాధితుల తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘‘యూఎస్‌సీ హెల్త్‌ సెంటర్‌లో ఎన్నో వందల మంది మహిళలు ఏళ్ల తరబడి లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ ఆరోపణలకు సంబంధించి యూఎస్‌సీ పలు తప్పుడు కథనాలను మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది. ఇవన్ని అవాస్తవాలని మేం నిరూపించగలం. అలానే తమకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలను నేను అభినందిస్తున్నాను. వారి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను’’ అన్నారు. ఇక నేరం రుజువైతే టిండాల్‌ 53 ఏళ్ల పాటు జైళ్లో ఉంటాడు. 

చదవండి: తండ్రి లైంగిక వేధింపులు: కాల్చి పడేసిన కూతురు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top