
శాంతిని నెలకొల్పుతాం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వైట్‌హౌస్‌లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ
వాషింగ్టన్: గాజా సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించబోదని తేల్చిచెప్పారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధానికి త్వరగా తెరపడాలన్నదే తన ఉద్దేశమని వివరించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు. గాజాలో అస్థిరతకు చరమగీతం పాడేసి, శాంతిని నెలకొల్పే దిశగా నెతన్యాహుతో ఒప్పందానికి దరిదాపుల్లోకి వచ్చానని అన్నారు.
ఈ ప్రణాళికకు అంగీకారం తెలియజేసినందుకు నెతన్యాహుకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. గాజాలో శాంతి సాధన విషయంలో ఇదొక చరిత్రాత్మక దినం అని వ్యాఖ్యానించారు. మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతికి అడుగు ముందుకు పడినట్లేనని ఉద్ఘాటించారు. తాను ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని హమాస్‌తోపాటు ఇతర భాగస్వామ్యపక్షాలు సైతం ఆమోదిస్తాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు.
ఒకవేళ ఆమోదం లభిస్తే గాజాలో తక్షణమే యుద్ధానికి తెరపడుతుందని తేల్చిచెప్పారు. నెతన్యాహు మాట్లాడుతూ... గాజా విషయంలో దీర్ఘకాల పరిష్కారానికి తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. అదే సమయంలో ప్రాంతీయ భద్రతను కూడా దృష్టిలో పెట్టుకోవాలని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్యంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించే విషయంలో నెతన్యాహుతో చర్చలు ఒక భాగమేనని ట్రంప్ పేర్కొన్నారు.
ఖతార్ ప్రధానమంత్రికి నెతన్యాహు క్షమాపణ
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్–థానీకి ఫోన్ చేసి క్షమాపణ కోరారు. ఇటీవల ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. ఈ ఉదంతం ముస్లిం దేశాల్లో అలజడి సృష్టించింది. ఇజ్రాయెల్ తీరును ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన నెతన్యాహు అక్కడి నుంచే ఖతార్ ప్రధానికి ఫోన్‌చేశారు. దోహాపై దాడుల పట్ల విచారం వ్యక్తంచేశారు. క్షమాపణ కోరారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.