ఇరాన్‌తో యుద్ధం.. భారీ ట్విస్ట్‌ ఇచ్చిన ట్రంప్‌ | USA Donald Trump Key Comments Over Hormuz | Sakshi
Sakshi News home page

ఇరాన్‌తో యుద్ధం.. భారీ ట్విస్ట్‌ ఇచ్చిన ట్రంప్‌

Mar 21 2026 8:07 AM | Updated on Mar 21 2026 8:55 AM

USA Donald Trump Key Comments Over Hormuz

వాషింగ్టన్‌: ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయెల్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ట్విస్ట్‌ ఇచ్చారు. హర్మూజ్ జలసంధి రక్షణ బాధ్యతను అమెరికా మోయాల్సిన అవసరం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో యుద్ధం ఆపాలని అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని ట్రంప్ కొట్టిపారేశారు.

వైట్‌హౌస్ నుంచి ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌కు బయలుదేరే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ..‘హార్మూజ్ జలసంధి రక్షణ బాధ్యతను అమెరికా మోయాల్సిన అవసరం లేదు. ఆ మార్గం ద్వారా ప్రయోజనం పొందే దేశాలు కొంతైనా చొరవ చూపాలి. యుద్ధం నేపథ్యంలో ఈ మార్గం ద్వారా లబ్ధి పొందుతున్న చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు రంగంలోకి దిగాలి. మాకు హార్ముజ్ జలసంధితో పనిలేదు లేదు. కానీ యూరప్, కొరియా, జపాన్, చైనా వంటి దేశాలకు ఇది చాలా అవసరం. చైనా తన ఇంధన అవసరాల్లో 90 శాతం, జపాన్ 95 శాతం ఈ మార్గం ద్వారానే లబ్ధి పొందుతున్నాయి. ఆ దేశాలే కొంచెం శ్రమించి, ఈ మార్గం రక్షణలో భాగం కావాలి’ అంటూ వ్యాఖ్యానించారు.

యుద్ధం ఆగదు.. 
మరోవైపు.. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా,ఇజ్రాయెల్ విజయం వైపు దూసుకుపోతున్నాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్ సైనిక వ్యవస్థను అమెరికా ఇప్పటికే తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. ఇరాన్‌ వైమానిక వ్యవస్థలను ధ్వంసం చేశామని, సైనిక పరంగా ఆ దేశం పని అయిపోందని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా చూడటమే తమ అంతిమ ధ్యేయమని చెప్పారు. అలాగే, యుద్ధం ఆపాలని అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని ట్రంప్ కొట్టిపారేశారు. తాము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ కాల్పుల విరమణ మాత్రం చేయబోం. శత్రువును పూర్తిగా తుడిచిపెడుతున్న సమయంలో యుద్ధం ఆపే ప్రసక్తే లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

నాటో మిత్రదేశాలపై ట్రంప్ విమర్శలు
ఇరాన్‌ యుద్ధంలో చేరనందుకు నాటో మిత్రదేశాలపై ట్రంప్ విమర్శలు చేశారు. పిరికివాళ్లను గుర్తుపెట్టుకుంటామంటూ హెచ్చరించారు. హార్మూజ్ జలసంధిని తెరిపించేందుకు నాటో దేశాలు రాకపోవడంపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. తన 'ట్రూత్ సోషల్' ప్లాట్‌ఫారమ్‌లో ఆయన నాటోను "పేపర్ టైగర్" అని విమర్శించారు. అమెరికా సహాయం లేకుండా నాటో ఏమీ చేయలేదని, ఇరాన్ వంటి దేశాల ముప్పును అడ్డుకోవడంలో వారు పిరికితనం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు జలసంధి తెరిపించేందుకు నాటో దేశాలను ట్రంప్‌ సైనిక సహాయం కోరారు. అయితే, అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్‌ను నాటో దేశాలు పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement