ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అలియాస్ EVMలు. ప్రతీ ఐదేళ్లకొకసారి ఇవి మనల్ని పలకరిస్తుంటాయి. అయితే వాటి ద్వారా పడిన ప్రతీ ఓటుకు నిజంగా భద్రత ఉంటుందా?. ఈవీఎంలను హ్యక్ చేసి మెజారిటీ ప్రజలిచ్చిన తీర్పును మార్చే అవకాశాలు ఏమాత్రం లేవా? అనే అనుమానాలు కలగడం సహజమే. మొన్నీమధ్య ఏపీ ఎన్నికల టైంలో.. అంతకు ముందు.. మన దేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల టైంలో ఈ తరహా ప్రశ్నలెన్నో తలెత్తాయి. అందుకేనేమో..
అమెరికాలాంటి అగ్రదేశం గత రెండు దశాబ్దాల ప్రయత్నాలతో ఎన్నికల విధానాన్ని ఈవీఎంల నుంచి మళ్లీ బ్యాలెట్‌కు తెచ్చుకుంది. నవంబర్ 5వ తేదీన జరగబోయే పోలింగ్ బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరగబోతోంది. 95 శాతం రిజిస్టర్డ్ ఓటర్లు అక్కడ పేపర్‌పై టిక్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 69.9 శాతం ఓటర్లు హ్యాండ్‌మార్క్‌డ్ పేపర్ బ్యాలెట్స్ విధానంలో ఓటేయొచ్చని, అలాగే బ్యాలెట్ మార్కింగ్ డివైజ్‌లతో(డిజిటల్ బ్యాలెట్.. ఓటేసి అప్పటికప్పుడే ఆ ప్రింట్ బయటకు తీయొచ్చు కూడా) కూడిన పేపర్‌బ్యాలెట్ ఓటింగ్ వైపు మరో 25.1 శాతం మంది మొగ్గుచూపిస్తారని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి.
ఈ లెక్కన.. కేవలం ఐదు శాతం ఓటర్లు మాత్రం మన దగ్గర ఈవీఎంల తరహా డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్(DRE) ద్వారా ఓటేసే ఛాన్స్ ఉంది.
అక్కడ ఏరకంగా ప్రయత్నించినా ప్రజా తీర్పును మార్చడానికి వీలుండదన్నమాట. ఈవీఎంల మేనిపులేషన్‌తో గెలవడం అక్కడ ఎంతమాత్రం కుదరదన్నమాట. సాంకేతికతను ముందుగా పుణికిపుచ్చుకునే అమెరికాలో.. ఈ తరహా ఓటింగ్ ఇంకా జరుగుతుండడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే..
అమెరికాలో 2000 సంవత్సరం దాకా పేపర్ బ్యాలెట్స్ ఓటింగ్ జరిగేది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ వైపు అడుగులేసింది. ఓటర్లు డీఆర్‌ఈ లేదంటే పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటేసే వీలు కల్పించారు. 2006 మధ్యంతర ఎన్నికల టైంలో 41.9 శాతం ఓటింగ్ డీఆర్‌ఈ వ్యవస్థ ద్వారానే జరిగింది. అయితే విదేశీ కుట్రలకు అవకాశం, హ్యాకింగ్ ఆరోపణల నేపథ్యంలో డీఆర్‌ఈపై అక్కడి ఓటర్లలోనూ నమ్మకం సన్నగిల్లింది. 2008 ఎన్నికల నుంచి డీఆర్‌ఈను ఓటర్లు తిరస్కరిస్తూ వచ్చారు. 2016 అమెరికా ఎన్నికల టైంలో రష్యా జోక్యం ఆరోపణలతో పూర్తిగా వాటిని పక్కన పడేశారు అక్కడి ఓటర్లు.
అందుకే అనుమానాలు
ఈవీఎం 'అన్‌లాకింగ్'పై రాజకీయ దుమారం కొత్తేం కాదు. మన దేశంలో ఈసీ అందుకు అవకాశమే లేదని చెబుతున్నా.. కొన్ని ఎన్నికల ఫలితాలతో ప్రజల్లోనూ వాటి వాడకంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాల టైంలో నడిచిన చర్చే ఇందుకు ఉదాహరణ. ఈ తరుణంలో ఆధునిక ఈవీఎంల వాడకం బదులు సంప్రదాయ రీతిలో పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగించాలనే అంశాన్ని కొందరు తెరపై తెచ్చారు. ఈ క్రమంలో..
ఇదీ చదవండి: ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్
ఎలక్ట్రానిక్స్, ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాల మీద సమారు అరవై ఏళ్ల పాటు నేను పనిచేశాను. ఈవీఎం యంత్రాల వ్యవస్థనూ క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమే. దీని వల్ల ఫలితాలు తామరుమారవుతాయి. ఈవీఎంల కంటే పాత బ్యాలెట్ పేపర్ విధానమే చాలా ఉత్తమమైంది. ఇందులో అయితే ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగవు. బ్యాలెట్ విధానాన్నే ఎన్నికల్లో అనుసరించాలి.
:::కాంగ్రెస్ నేత శ్యామ్‌పిట్రోడా
భారత్‌లో వాడే ఈవీఎంలు అమెరికాలో వాడే తరహావి కావు. ఇక్కడి ఈవీఎంలు కంప్యూటర్ ప్లాట్‌ఫాం మీద తయారు చేయలేదు. వాటికి బయటి నుంచి ఎలాంటి నెట్‌వర్క్‌తో అనుసంధానించే అవకాశమే లేదు. రీ ప్రోగ్రామింగ్ కూడా వీలు లేదు. ఇలాంటి పరికరాలను హహ్యాక్ చేయడం కుదరదు. కావాలంటే ప్రపంచ దేశాలు భారత ఈవీఎంలను వారి ఎన్నికల్లో వాడుకోవచ్చు.
:: కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
భారత్‌లో వాడుతున్న ఈవీఎంలకు సైబర్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి రక్షణ ఉందనేది మనకెవరికీ తెలియదు. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు సంబంధించి ఈవీఎంలు ISO 27001 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది నిపుణులు తేల్చాలి. ఈవీఎంల భద్రతకు ఎలాంటి సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను వాడుతున్నారనేది ఇప్పటివరకు బహిర్గతమవలేదు. ఎవరికీ తెలియదు.
::: సైబర్ లా నిపుణుడు పవన్ దుగ్గల్
ఈవీఎంలను మనం తొలగించాలి. వీటిని వ్యక్తులు లేదంటే ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం. ఇది ఏ దేశానికైనా నష్టమే కలిగిస్తుంది.
:: ప్రముఖ బిలీయనీర్ ఎలాన్ మస్క్
ఇదీ చదవండి: మీకు తెలుసా? ఈ దేశాల్లో పేపర్ బ్యాలెటే ముద్దు
నిపుణుల నుంచి సామాన్యుల దాకా ఈవీఎంల వాడకంపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతుంటారు. కానీ, ఈ మధ్యకాలంలో పాపులర్ టెక్నాలజీ నిపుణులు కూడా వాటి పని తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తుండడం చూస్తున్నాం. దీంతో ఈవీఎంలపై అనుమానాలకు శాస్త్రీయ నివృత్తి అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే..
ఈవీఎంలపై ఇంతమంది ఇన్ని అభిప్రాయాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నపుడు ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడితేనే బెటరని సామాన్యులతో పాటు పార్టీల అధినేతలు సూచిస్తున్నారు. ఈవీఎంలు వాడకంలో అయ్యే ఖర్చుతో పోలిస్తే బ్యాలెట్ విధానంలో ఖర్చు కొద్దిగా పెరిగినప్పటికీ, ఎన్నికల ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ ఓటర్లకు ప్రజాస్వామ్యంపై పూర్తి నమ్మకం కలగాలంటే బ్యాలెట్ పేపరే బెస్ట్ అనే వాదన వినిపిస్తోంది.
‘‘పేపర్ బ్యాలెట్‌తో ఓటర్ల విశ్వాసాన్ని పెంచవచ్చు. మనలాంటి ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలి. రెండింటినీ నిర్ధారించడానికి ఏకైక మార్గం, పేపర్ బ్యాలెట్‌కి తిరిగి వెళ్లడం. USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే మరియు డెన్మార్క్‌లతో సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, మనం ప్రపంచంలోని ఇతర దేశాలతో మార్పులు చేసి పేపర్ వైపు వెళ్లే సమయం ఇది. బ్యాలెట్, ఇది ఓటర్ల విశ్వాసాన్ని పెంచుతుంది. విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలి’’
:::హర్యానా ఎన్నికలపై.. ఎగ్జిట్‌పోల్స్‌కు విరుద్ధంగా వెలువడిన ఫలితాలపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment