
మన ఎన్నికల సంఘం(ఈసీ)కి ఇష్టమున్నా లేకున్నా ఈవీఎంలపై సంశయాలు తరచు తలెత్తుతూనే ఉన్నాయి. ఇక్కడే కాదు... వేరే దేశాల్లో సైతం సందేహాలు వినబడుతూనే వున్నాయి. ఆ మధ్య టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఈవీఎంలను హ్యాక్ చేయటం సులభమని, దీన్ని తాను నిరూపించగలనని సవాలు విసిరారు. ఇప్పుడు ఆ వరసలో అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబ్బార్డ్ సైతం నిలిచారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమక్షంలో కేబినెట్ భేటీలో ఆమె ఈవీఎంల భద్రతా లోపాలపై పలు ఆధారాలు సమర్పించారు.
యథావిధిగా దీనిపైనా మన ఈసీ స్పందించింది. ఆమె వ్యాఖ్యలు మన ఈవీఎంలకు వర్తించబోవని మాట్లాడింది. సమస్యంతా అక్కడేవుంది. మన దేశంలో పార్టీలు చేసే ఆరోపణలకు ఆ సంఘం నోరు మెదపదు. ఒక జాతీయ పార్టీ, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో చేసిన ఆరోపణలకు వెనువెంటనే జవాబివ్వడానికి ఈసీకి తీరిక లేకపోయింది. పార్లమెంటులో ఈవీఎంలపై తీవ్ర దుమారం రేగాక మాత్రమే స్పందించింది. గత ఏడాది నవంబర్ 4న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ఆ నెల 23న ఫలితాలు ప్రకటించారు.
ఆ తర్వాతనుంచి కాంగ్రెస్, ఎన్సీపీ ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తూనే వచ్చాయి. 95 నియోజక వర్గాల్లో ఈవీఎంలూ, వీవీప్యాట్ స్లిప్‌లూ తనిఖీ చేసి అవి సరిపోలాయో లేదో చెప్పాలని 104 అభ్యర్థనలు వచ్చాయి. వాటిని అంగీకరిస్తే దాదాపు 755 ఈవీఎంల తనిఖీ తప్పనిసరవుతుంది. ఇందులో ఎన్సీపీనుంచి దాఖలైనవే ఎక్కువ. ఇవిగాక న్యాయస్థానాల్లో దాఖలైన ఎన్నికల పిటిషన్లు సరేసరి. హరియాణాలో సైతం ఈవీఎంలపై ఆరుచోట్ల అభ్యర్థనలొచ్చాయి. జమ్మూ కశ్మీర్‌లో ఒక స్థానం నుంచి ఈ మాదిరి వినతి వచ్చింది.
ఆరోపణలొచ్చినప్పుడల్లా ఈసీ ఇచ్చే జవాబు ఒకే విధంగా ఉంటున్నది. మన ఈవీఎంలు సురక్షితమైనవి, జొరబడటానికి అసాధ్యమైనవి అన్నదే దాని వాదన. అలాగే అవి ఇంటర్నెట్‌తోసహా దేనికీ అనుసంధానించి వుండవు కనుక వైఫై, బ్లూటూత్‌ల ద్వారా ఏమార్చటం ఏమాత్రం కుదరదని కూడా చెబుతోంది. అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన సాంకేతిక సదస్సులో కంప్యూటర్ శాస్త్రవేత్త అలెక్స్ హాల్డర్‌మాన్ ఆనవాలు మిగల్చకుండా ఈవీఎంను హ్యాక్ చేయటం, ఫలితాన్ని తారుమారు చేయటం ఎంత సులభమో నిరూపించారు.
వీవీ ప్యాట్ యంత్రాలతో అనుసంధానించివున్నా ఈవీఎంల పనితీరు ఎన్ని సంశయాలకు తావిస్తున్నదో వివరించే గణాంకాలు సదస్సులో సమర్పించారు. కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ ఎకార్ట్ ఈవీఎంలో వోటేసిన వెంటనే స్క్రీన్‌పై ఎంపిక చేసుకున్న అభ్యర్థి పేరే కనబడుతున్నా వేరేవారికి వోటు పడటంవంటి ఉదంతాలను వివరించారు.
ఇంటర్నెట్‌తో ఈవీఎంలను అనుసంధానించకపోయినా హ్యాక్ చేయటం సాధ్యమేనన్నారు. ఈవీఎంలలో గుట్టుచప్పుడు కాకుండా రిమోట్ యాక్సిస్ సాఫ్ట్‌వేర్‌ను నిక్షిప్తం చేయటంద్వారా ఇది చేయొచ్చన్నది ఆయన వాదన. అసలు ఈవీఎంల రవాణా, పంపిణీ విధానం లోపభూయిష్టంగా ఉన్నదని సమాచార హక్కు చట్టంకింద అడిగిన ప్రశ్నలకు వచ్చిన సమాధానాలు వెల్లడించాయి.
తన నిర్వహణలో సమర్థవంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని, అందులో సందేహాలకు తావు లేదని ఎన్నికల సంఘం నమ్మటం తప్పేమీకాదు. ఆమాత్రం ఆత్మవిశ్వాసం ఉండటాన్ని ఎత్తిచూపించాల్సిన అవసరం లేదు. కానీ అదే విశ్వాసం అందరిలో కలగటానికి అది చేస్తున్నదేమిటన్నదే ప్రశ్న. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే, ఆ రోజు రాత్రి, ఆ తర్వాత విడుదల చేసే పోలింగ్ శాతం వివరాలు ఆశ్చర్యం కలిగిస్తున్నా, వాటిల్లో ఎందువల్ల వ్యత్యాసం చోటుచేసుకుంటున్నదో సందేహాతీతంగా అది వివరించలేకపోతున్నది.
నిరుడు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు కావొచ్చు... మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కావొచ్చు పోలింగ్ శాతం పెరుగుదలలో తీవ్ర వ్యత్యాసం కనబడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏపీలో పోలింగ్ జరిగిన రాత్రి 8 గంటలకు 68.12 శాతం పోలింగ్ నమోదైందని చెప్పిన ఈసీ మరో నాలుగు రోజులకల్లా దాన్ని 80.66 శాతంగా ప్రకటించింది. నాలుగురోజుల వ్యవధిలో ఈ పెరుగుదల ఏకంగా 12.5 శాతం! సంఖ్యా పరంగా 49 లక్షల వోట్లు పెరిగినట్టు లెక్క! మొదటగా అనుకున్న శాతానికీ, చివరిగా ప్రకటించిన శాతానికీ మధ్య తేడాకు కారణాలేమిటో వివరించే ప్రయత్నం ఈనాటికీ ఈసీ చేయలేదు.
మహా రాష్ట్రలోనూ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ముగిశాక 58.2 శాతం పోలింగ్ అని చెప్పి, ఆ తర్వాత దాన్ని 65.02కు పెంచి తీరా కౌంటింగ్ ముందు అది 66.05 శాతం అన్నారు. బ్యాలెట్ విధానంలో ఇలాంటి వ్యత్యాసాలు కనబడ్డాయంటే అర్థం చేసుకోవచ్చు. లెక్కించేది మనుషులే గనుక పొర బడ్డారని సరిపెట్టుకోవచ్చు. కానీ ఈవీఎంల విధానంలో అలా కాదు. ఎప్పటి కప్పుడు పోలైన వోట్ల సంఖ్య తెలిసిపోతుంది. మరి ఈ తేడాల వెనకున్న మతలబేమిటో ఎందుకు చెప్పరు? ఈవీఎంల చార్జింగ్ అమాంతం పెరిగిపోవటంపైనా అనేక సందేహాలున్నాయి.
ప్రశ్నించినప్పుడు మౌనం వహించటమే పెద్దరికమవుతుందని ఈసీ భావిస్తున్నట్టుంది. ప్రజాస్వామ్యానికి కీలకమని భావించే ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కరువైతే అది చివరకు ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం పాలు చేస్తుంది. అది ఇప్పటికే ఎంతో కొంత మొదలైంది. అందుకనే బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలన్న డిమాండ్ క్రమేపీ పుంజుకుంటున్నది. ఈవీఎంలు నమ్మదగ్గవి కాదని ప్రపంచంలో ఏమూల ఎవరు చెప్పినా ఇక్కడ భుజాలు తడుముకోవటంవల్ల ప్రయోజనం లేదు. అలాగే పారదర్శకతకు ప్రత్యామ్నాయం కూడా ఉండదు.