
సాక్షి,న్యూఢిల్లీ: ఈవీఎంలు వద్దు పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల నిర్వహణ, సంస్కరణలపై అన్ని రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఢిల్లీలో ఈసీ సమావేశానికి బీఆర్‌ఎస్ నుంచి కేటీఆర్‌తో పాటు ఇతర పార్టీ నేతలు హాజరయ్యారు. ఈసీతో సమావేశం అనంతరం, కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
‘పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి. బీహార్ ఎన్నికల నుంచే పేపర్ బ్యాలెట్‌తో ఎన్నికల జరపాలి. ఈవీఎంలపై అనేక అనుమానాలు ఉన్నాయి. అనేక దేశాలు బ్యాలెట్ విధానంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై బాండ్ పేపర్లతో ప్రజలను వంచించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండకపోతే ప్రజలు శిక్షించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. హామీలు నెరవేర్చకపోతే సభ్యత్వం రద్దు చేయాలి. బీహార్ ప్రత్యేక ఓటర్ సవరణ పై కూడా చర్చ జరిపాం. ఓటర్లను ఉద్దేశపూర్వకంగా తీసేయలేదు అని ఎన్నికల సంఘం చెప్పింది. ఓటరు జాబితా సవరణ మంచిదే కానీ అందరి విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకొని చేయాలి. అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు.
అదే సమయంలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించేందుకు జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై స్పందించారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ట్రాష్, గ్యాస్. కాళేశ్వరం కమిషన్ నివేదికలో 650 పేజీల్లో ఉన్న నివేదికను 60 పేజీల్లోకి కుదించి అసెంబ్లీలో పెడతామని అంటున్నారు.అసెంబ్లీలో మైకు కట్ చేయకుండా ఉంచితే కాంగ్రెస్ ను చీల్చి చెండాడుతాం.దురుద్దేశంతో మాపై ప్రచారం చేస్తున్నారు.
కేసీఆర్ ,బీఆర్‌ఎస్‌పై దుష్ప్రచారం. మొత్తం నివేదికను బయట పెట్టాలి.అసెంబ్లీలో నివేదిక పెట్టాలి.బీసీల కు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చెయ్యడం లేదు. సబ్ ప్లాన్ ఎందుకు పెట్టరు. మీ చేతుల్లో ఉన్న పనులు ముందు చెయ్యండి. ఢిల్లీలో డ్రామా లు చేస్తే ఎవ్వరు నమ్మరు’అని ఎద్దేవా చేశారు.