అమెరికా నౌక ప్రమాదం.. ఆరుగురు మృతి! | Sakshi
Sakshi News home page

అమెరికా నౌక ప్రమాదం.. ఆరుగురు మృతి!

Published Wed, Mar 27 2024 3:25 AM

US Bridge Collapses After Ship Collision mass casualties feared - Sakshi

కుప్పకూలిన వంతెన

నదిలో పడిపోయిన వాహనాలు

అమెరికాలోని బాల్టీమోర్‌లో ఘటన 

నౌక సిబ్బంది అంతా భారతీయులే 

వారి హెచ్చరికలతో తప్పిన పెను ప్రమాదం 

బాల్టిమోర్‌: అమెరికాలోని మేరీలాండ్‌ రాష్ట్రంలోని బాల్టీమోర్‌ నగరంలో చోటు చేసుకున్న బ్రిడ్జ్‌ కుప్పకూలిన ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. నదిలో పడి గల్లంతు అయిన ఆరుగురు మరణించారని భావించిన అధికారులు సహాయక చర్యలు నిలిపివేశారు. మంగళవారం అమెరికాలో మేరీలాండ్‌ రాష్ట్రంలోని బాల్టీమోర్‌ నగరంలో ఘోర ప్రమాదం సంభవించింది.

పటాప్‌స్కో నదిలో వాహన కంటైనర్లతో వెళ్తున్న ఓ భారీ నౌక పవర్‌ ఫెయిల్యూర్‌కు గురైంది. అదుపు తప్పి నదిపై ఉన్న ఫ్రాన్సిస్‌ స్కాట్‌ కీ బ్రిడ్జిని శరవేగంగా ఢీకొంది. దాంతో వంతెన కుప్పకూలింది. దానిపై ప్రయాణిస్తున్న వాహనాలు నీటిలో పడి మునిగిపోయాయి. వాటిలో ప్రయాణిస్తున్నవారు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై గుంతలు పూడుస్తున్న ఆరుగురు సిబ్బంది కూడా నదిలో పడిపోయారు. అధికారులు ఇద్దరిని రక్షించారు.

కనీసం ఆరుగురి దాకా గల్లంతైనట్టు తెలుస్తోంది. ప్రమాద స్థలంలో నది 15 మీటర్ల లోతుంది. నీళ్లు కూడా బాగా చల్లగా ఉండటంతో వారంతా దుర్మరణం పాలై ఉంటారని భావిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి 1.30 దాటాక ఈ దుర్ఘటన జరిగింది. నౌకలోని సిబ్బంది మొత్తం భారతీయులే. నౌక అదుపు తప్పిన వెంటనే వారు హుటాహుటిన ప్రమాద హెచ్చరికలు (మేడే) జారీ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు అప్రమత్తమై వాహనాలేవీ బ్రిడ్జిపైకి వెళ్లకుండా నియంత్రించారు. దానికి తోడు ప్రమాదం జరిగింది అర్ధరాత్రి వేళ కావడంతో బ్రిడ్జిపై ట్రాఫిక్‌ కూడా భారీగా లేదు. 

ఇలా జరిగింది... 
ప్రమాద సమయంలో నౌక గంటకు 15 కి.మీ. వేగంతో వెళ్తోంది. పవర్‌ ఫెయిల్యూర్‌తో అదుపు తప్పి శరవేగంగా బ్రిడ్జికేసి దూసుకొచ్చి దాని తాలూకు పిల్లర్‌ను ఢీకొట్టింది. పిల్లర్‌ విరగడంతో 2.6 కిలోమీటర్ల పొడవున్న వంతెన ఒక్కసారిగా కుంగిపోయింది. సెకండ్ల వ్యవధిలో పాక్షికంగా కుప్పకూలింది. ఆ వెంటనే నౌకలో మంటలు చెలరేగి దట్టమైన పొగ వెలువడింది. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ప్రమాద వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కనీవినీ ఎరగని ప్రమాదమని మేరీలాండ్‌ గవర్నర్‌ వెస్‌ మూర్‌ అన్నారు. ప్రమాద హెచ్చరికకు అధికారులు శరవేగంగా స్పందించి ఎంతోమంది ప్రాణాలను కాపాడారంటూ కొనియాడారు. ప్రమాదం జరిగిన తీరు యాక్షన్‌ సినిమా సీన్‌ను తలపించిందని బాల్టీమోర్‌ మేయర్‌ బ్రాండన్‌ స్కాట్‌ అన్నారు. నగరంలో అత్యవసర పరిస్థితి విధించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పవర్‌ ఫెయిల్యూరే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేలినా మరింత లోతుగా దర్యాప్తు సాగుతోంది.  

భారత సిబ్బంది క్షేమం 
ప్రమాదానికి గురైన నౌక పేరు డాలీ. గ్రీస్‌ ఓషియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన ఈ నౌక ప్రస్తుతతం సినర్జీ మెరైన్‌ గ్రూప్‌ నిర్వహణలో ఉంది. ప్రఖ్యాత డెన్మార్క్‌ షిప్పింగ్‌ కంపెనీ ‘మెర్క్స్‌’కు చెందిన సరుకుతో బాల్టిమోర్‌ రేవు నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు వెళ్తుండగా దుర్ఘటన జరిగింది. 985 అడుగుల పొడవు, 157 అడుగుల వెడల్పున్న ఈ నౌకలో ఇద్దరు పైలట్లు సహా మొత్తం 22 మంది సిబ్బందీ భారతీయులేనని సినర్జీ మెరైన్‌ గ్రూప్‌ వెల్లడించింది. వారంతా క్షేమంగానే ఉన్నారని పేర్కొంది. ప్రమాదం నేపథ్యంలో అమెరికా తూర్పు తీరంలో అత్యంత బిజీ ఓడరేవుల్లో ఒకటైన బాల్టీమోర్‌కు నౌకల రాకపోకలు కనీసం కొద్ది నెలల పాటు స్తంభించనున్నాయి. గతేడాది బాల్టీమోర్‌ రేవు గుండా ఏకంగా 5.2 కోట్ల టన్నుల మేరకు సరుకు, దాదాపు 5 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు జరిగాయి! పోర్టుకు నౌకల రాకపోకలను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. దుర్ఘటన ఉగ్రవాద చర్య కాదని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement