
కాల్పుల విరమణ, బందీల విడుదల తీర్మానానికి యూకే, ఫ్రాన్స్, చైనా, రష్యా సహా 14 దేశాలు మద్దతు
ఐక్యరాజ్యసమితి: గాజాలో తక్షణమే శాశ్వత కాల్పుల విరమణ పాటించాలని, బందీలందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఐరాస భద్రతామండలి చేసిన తీర్మానాన్ని గురువారం మరోసారి అమెరికా వీటో చేసింది. హమాస్ చర్యలను ఈ తీర్మానం సరైన విధంగా ఖండించలేదంటూ అగ్ర రాజ్యం తప్పుబట్టింది. మండలిలోని శాశ్వత సభ్యత్వమున్న రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే సహా 14 దేశాలు ఈ తీర్మానాన్ని బలపర్చగా, అమెరికా మాత్రం తిరస్కరించింది.
తనకున్న వీటో హక్కును వాడుకుంది. రెండేళ్ల పదవీకాలానికి ఎన్నికైన 10 శాశ్వతేతర దేశాలు ఈ తీర్మానాన్ని రూపొందించాయి. గాజాలో పరిస్థితులపై గత నెలలో విడుదల చేసిన నివేదికలో ఐరాస తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అత్యంత తీవ్రమైన కరువు నెలకొందని, వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి, మానవతా సాయంపై ఆంక్షలు తొలగిస్తేనే ఈ పరిస్థితి మెరుగవుతుందని పేర్కొంది. ఈ నివేదికను మండలి ముసాయిదా తీర్మానం ప్రస్తావించింది.
గాజాలో తీవ్ర మానవీయ సంక్షోభం కొనసాగుతోందని తీర్మానం పేర్కొంది. అక్కడున్న 21 లక్షల పాలస్తీనియన్లకు సాయం అందించడంలో ఉన్న అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయాలని ఇజ్రాయెల్‌ను కోరింది. అయితే, ‘ఈ తీర్మానం హమాస్ చర్యలను తప్పుబట్టలేదు, ఇజ్రాయెల్‌కుగల ఆత్మరక్షణ హక్కును బలపర్చలేదు. హమాస్‌కు అనుకూల తప్పుడు వాదనలనే ఈ తీర్మానం తలకెత్తుకుంది.
ఈ పరిస్థితుల్లో అమెరికా ఈ తీర్మానాన్ని వీటో చేస్తుంది’అని ఓటింగ్‌కు ముందే సీనియర్ యూఎస్ పాలసీ అడ్వైజర్ మోర్గాన్ ఒరా్టగుస్ వ్యాఖ్యానించారు. అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా మండలి సభ్యదేశాలు తీర్మానంలో వాడిన భాష కూడా ఆమోదయోగ్యంగా లేదన్నారు.
మరికొద్ది రోజుల్లో ఐరాస జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రపంచ దేశాల నేతలు ప్రసంగిస్తారు. ఈ దఫా ప్రధానంగా గాజాపై చర్చ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే సమయంలో, అమెరికా ప్రధాన మిత్ర దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ప్రకటించే అవకాశం కన్పిస్తోంది. ఈ వైఖరిని ఇజ్రాయెల్‌తోపాటు అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
తీర్మానం వీగిన అనంతరం ఐరాసలో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ స్పందిస్తూ.. భద్రతా మండలి సెషన్‌లో జరిగిన పరిణామాలు పాలస్తీనా ప్రజల్లో మరింత ఆవేదనకు ఆగ్రహానికి కారణమవుతాయని వ్యాఖ్యానించారు. మండలి సభ్యదేశం నైజీరియా స్పందిస్తూ.. సామాన్య పౌరుల ప్రాణాలను కాపాడలేకపోతున్నందుకు క్షమించాలంటూ పాలస్తీనా వాసులను కోరింది. ఇజ్రాయెల్ రాయబారి స్పందిస్తూ.. బందీల విడుదలకు గానీ, ఈ ప్రాంతంలో భద్రతను నెలకొల్పడానికి గానీ ఈ తీర్మానం ప్రయతి్నంచలేదని ఆరోపించారు. తమ పౌరుల భద్రతకు, హమాస్‌కు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందన్నారు.
గత వారం జరిగిన ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశం ఇజ్రాయెల్–పాలస్తీనా రెండు దేశాల ప్రతిపాదనను అత్యధిక మెజారీ్టతో ఆమోదించింది. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఇజ్రాయెల్‌ను కోరింది. హమాస్ లక్ష్యంగా గాజాను నెలలుగా ఇజ్రాయెల్ ఆర్మీ దిగ్బంధించడంతోపాటు పౌరులపై యథేచ్ఛగా కాల్పులు, దాడులకు పాల్పడటాన్ని ఫ్రాన్స్, యూకే తీవ్రంగా ఖండిస్తున్నాయి. త్వరలో జరిగే ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించే ప్రతిపాదనకు మద్దతిస్తామని ప్రకటించాయి.