యూఏఈలో కొత్త రూల్‌.. కంపెనీలకు కఠిన హెచ్చరిక | UAE Midday Work Ban: Companies Face Fines Up to AED 50000 Summer labour Rules | Sakshi
Sakshi News home page

యూఏఈలో కొత్త రూల్‌.. కంపెనీలకు కఠిన హెచ్చరిక

Jul 6 2026 11:11 PM | Updated on Jul 6 2026 11:17 PM

UAE Midday Work Ban: Companies Face Fines Up to AED 50000 Summer labour Rules

అబుదాబి: వేసవి తీవ్రత దృష్ట్యా కార్మికుల భద్రతకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం మరోసారి ప్రాధాన్యం ఇచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మధ్యాహ్నం పనులు నిషేధించే 'మిడ్‌డే బ్రేక్' నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తప్పవని మానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) స్పష్టం చేసింది. నిబంధనలను అతిక్రమించి కార్మికులతో పని చేయిస్తే ఒక్కో కార్మికుడికి 5,000 దిర్హమ్‌లు చొప్పున ఆ కంపెనీలకు జరిమానా విధిస్తారు.

ఒకే ఉల్లంఘనలో ఎక్కువ మంది కార్మికులు ఉంటే మొత్తం జరిమానా 50,000 దిర్హమ్‌ల వరకు చేరే అవకాశం ఉంది. అంతేకాక, కంపెనీ పనుల అనుమతులను నిలిపివేయడం, సంస్థ వర్గీకరణ (కంపెనీ గ్రేడ్)ను తగ్గించడం వంటి పరిపాలనా చర్యలు కూడా తీసుకుంటారు. ఉల్లంఘనల కారణంగా కార్మికులు గాయపడితే లేదా ఇతర కార్మిక చట్టాల ఉల్లంఘనలు జరిగితే కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపుతామని అధికారులు హెచ్చరించారు.

ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు, ప్రతిరోజూ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల వరకు ఎండలో లేదా బహిరంగ ప్రదేశాల్లో పనులు పూర్తిగా నిషేధించారు. ఈ విధానం అమలవడం ఇది వరుసగా 22వ సంవత్సరం. నిర్మాణ రంగం, రోడ్ల పనులు, నిర్వహణ పనులు, ల్యాండ్‌స్కేపింగ్‌తో పాటు డెలివరీ సిబ్బందికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. కార్మికులను తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల కలిగే హీట్ స్ట్రోక్‌, డీహైడ్రేషన్‌, ఇతర ఆరోగ్య సమస్యల నుంచి కాపాడడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది.

అయితే కొన్ని అత్యవసర సేవలకు మినహాయింపులు ఉన్నాయి. నీరు, విద్యుత్, టెలికమ్యూనికేషన్ సేవల్లో అత్యవసర మరమ్మతులు, ప్రజా భద్రతకు సంబంధించిన పనులు, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వెంటనే పూర్తి చేయాల్సిన రహదారి పనులు, అలాగే సంబంధిత అధికారుల అనుమతితో చేపట్టే కొన్ని ప్రత్యేక ప్రాజెక్టులు ఈ నిషేధం నుంచి మినహాయింపు పొందుతాయి. అయితే మినహాయింపు ఉన్నా కూడా కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ తరహా పనులు నిర్వహించే సంస్థలు తప్పనిసరిగా కార్మికులకు నీడ కలిగిన విశ్రాంతి ప్రదేశాలు, చల్లటి తాగునీరు, ఎలక్ట్రోలైట్ లేదా లవణాలు కలిగిన పానీయాలు, ఫ్యాన్లు లేదా ఇతర శీతలీకరణ పరికరాలు, ప్రథమ చికిత్స కిట్‌లు అందుబాటులో ఉంచాలి. ఈ నిబంధనలు అమలవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు అత్యాధునిక డిజిటల్ వ్యవస్థలతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన తనిఖీ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఉల్లంఘనలు గమనించిన ప్రజలు 600590000 కాల్ సెంటర్‌కు సమాచారం ఇవ్వవచ్చు లేదా మంత్రిత్వ శాఖ స్మార్ట్ యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చని అధికారులు తెలిపారు. గత సంవత్సరాల్లో ఈ నిబంధనలకు 99 శాతానికి పైగా కంపెనీలు అనుగుణంగా వ్యవహరించాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement