ఇక అమ్మకానికి ట్విట్టర్‌ ‘బ్లూ టిక్‌’

Twitter will charge USD 8 per month for blue tick says Elon Musk - Sakshi

నెలకు 8 డాలర్లు 

కొత్త బాస్‌ మస్క్‌ ప్రకటన

న్యూయార్క్‌: ట్విట్టర్‌లో యూజర్‌ నేమ్‌ అధికారికమైనది, ప్రముఖమైనదని నిర్ధారించే వెరిఫికేషన్‌ బ్లూ టిక్‌ కోసం ఇక నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందే. సంస్థ కొత్త బాస్, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (51) తీసుకున్న ఈ మేరకు ప్రకటించారు. ‘‘ప్రజలకు అధికారం! బ్లూ టిక్‌కు నెలకు 8 డాలర్లు’’ అంటూ మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు. ఈ చార్జీ కొనుగోలు శక్తి ప్రాతిపదికగా ఒక్కో దేశానికి ఒక్కోలా ఉంటుందని చెప్పుకొచ్చారు.

‘‘బ్లూ టిక్‌ యూజర్లకు ఇకపై రిప్లైలు, మెన్షన్లు, సెర్చ్‌ల్లో జర్లకు మరింత ప్రయారిటీ దక్కుతుంది. స్పామ్‌లు, స్కామ్‌ల బెడద తగ్గడమే గాక పెద్ద వీడియోలు, ఆడియోలు పోస్ట్‌ చేసుకోవచ్చు. యాడ్లు సగానికి తగ్గుతాయి’’ అంటూ తాను కల్పించబోయే సౌకర్యాలను ఏకరువు పెట్టారు. ఇకనుంచి రాజకీయ నాయకుల మాదిరిగా ఇతర ప్రముఖులకు కూడా పేరు కింద సెకండరీ ట్యాగ్‌ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

కానీ ఆయన తాజా నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది వ్యాపార ధోరణికి పరాకాష్ట అంటూ యూజర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ‘‘బ్లూ టిక్‌ కొనసాగాలంటే ఇకపై నేను నెలకు 20 డాలర్లు చెల్లించాలా? ఏమన్నా అర్థముందా?’’ అంటూ 70 లక్షల మంది ఫాలోవర్లున్న రచయిత స్టీఫెన్‌ కింగ్‌ అసంతృప్తి వెలిబుచ్చారు. నిజానికి ట్విట్టరే తనకు ఎదురు డబ్బులు చెల్లించాలంటూ ట్వీట్‌ చేశారు. బదులుగా మస్క్‌ కూడా, ‘‘మేం కూడా బిల్లులు చెల్లించాలిగా! కేవలం ప్రకటనలపై ఆధారపడి సంస్థను నడపలేం’’ అంటూ ట్వీట్‌ చేశారు.

‘‘ఎవరైనా యూజర్‌ 8 డాలర్లు చెల్లించి తన డిస్‌ప్లే నేమ్‌ను ఎలాన్‌ మస్క్‌ అని మార్చుకుని నీ ప్రొఫైల్‌ పిక్‌నే పెట్టుకుని అచ్చం నీలా ట్వీట్లు చేయడం మొదలు పెడితే అప్పుడేం చేస్తావ్‌?’’ అంటూ రుబియూ5 అనే యూజర్‌ మస్క్‌ను ప్రశ్నించాడు. కానీ మస్క్‌ మాత్రం తగ్గేదే లేదని కుండబద్దలు కొట్టారు. ‘‘ఎవరెన్ని విమర్శలైనా చేయండి. నెలకు 8 డాలర్లు మాత్రం కట్టి తీరాల్సిందే’’ అంటూ ట్వీట్‌ చేశారు. ట్విట్టర్‌ తన చేతుల్లోకి వస్తూనే సీఈఓ పరాగ్‌ అగర్వాల్, లీగల్‌ హెడ్‌ విజయ గద్దెతో పాటు మరో ఇద్దరు అత్యున్నతాధికారులను వివాదాస్పద రీతిలో మస్క్‌ ఇంటికి పంపడం తెలిసిందే. నకిలీ ఖాతాల బెడదను నివారించేందుకు ట్విట్టర్‌ సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శల నేపథ్యంలో 2009లో బ్లూ టిక్‌ను సంస్థ ప్రవేశపెట్టింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top