వాషింగ్టన్ డీసీ: ఇరాన్‌ను ఇన్నాళ్లుగా హెచ్చరిస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సాయంత్రం మాత్రం ఆ దేశాన్ని ఓ కోరిక కోరారు. ఇరాన్ ఎనిమిది మంది మహిళలకు మరణశిక్ష అమలు చేయడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిని విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు.
ఇలా చేస్తే ఇరు దేశాల మధ్య చర్చలకు గొప్ప ఆరంభం అవుతుందని ట్రంప్ చెప్పారు. ఇరాన్-అమెరికా మధ్య పాకిస్థాన్‌లో జరగాల్సిన చర్చలు అనిశ్చితిలో ఉన్న సమయంలో.. సైనిక చర్యకు అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒక్కసారిగా ట్రంప్ చాలా కూల్‌గా విజ్ఞప్తి చేస్తూ ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘నా ప్రతినిధులతో త్వరలో చర్చల్లో పాల్గొనబోయే ఇరాన్ నాయకులకు చెబుతున్నాను. ఈ మహిళలను విడుదల చేస్తే నేను ఎంతో కృతజ్ఞతగా భావిస్తాను. మీరు తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఆ మహిళలు గౌరవంగా భావిస్తారు, దానికి విలువ ఇస్తారన్న నమ్మకం ఉంది. దయచేసి వారికి ఎలాంటి హాని చేయవద్దు. ఇది మా చర్చలకు గొప్ప ఆరంభం అవుతుంది. ఈ విషయంపై మీరు చూపిన శ్రద్ధకు ధన్యవాదాలు’ అని ట్రంప్ పేర్కొన్నారు.
కాగా, ఎక్స్‌లో ఒకరు ఆ ఎనిమిది మంది మహిళల ఫొటోలను పోస్ట్ చేశారు. ‘ఈ ఎనిమిది మంది మహిళలను ఉరితీయాలని ఇస్లామిక్ రిపబ్లిక్ సన్నాహాలు చేసుకుంటోంది. అంతర్జాతీయ సమాజం నుంచి, మానవ హక్కుల సంస్థలవారిమని చెప్పుకునే వారి నుంచి దీనిపై ఒక్క మాట కూడా రావడం లేదు’ అని అన్నారు. ఈ పోస్టుపైనే ట్రంప్ స్పందించారు.
కాగా, ఇరాన్-అమెరికా మధ్య రెండో దశ చర్చలు ఇప్పటికే జరగాల్సి ఉండగా పాకిస్థాన్‌కు ఇరాన్ రాకపోవడంతో జరగలేదు. అసలు రెండో దశ చర్చలు జరుగుతాయా? అన్న సందిగ్ధత నెలకొంది. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం రాత్రిలో ముగియనుంది. ఆ తర్వాత మళ్లీ యుద్ధం జరుగుతుందా? అన్న భయాలు నెలకొన్నాయి.


