ట్రంప్‌ సుంకాల మోత.. అధికంగా 41 శాతం, పాకిస్తాన్‌పై ఎంతంటే? | Donald Trump Increases Tariffs On Canada Levies To 35% On All Products Not Covered By The US, Check Post Inside | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ సుంకాల మోత.. అధికంగా 41 శాతం, పాకిస్తాన్‌పై ఎంతంటే?

Aug 1 2025 7:41 AM | Updated on Aug 1 2025 10:51 AM

Trump increases tariffs Canada levies to 35

వాష్టింగన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సుంకాలు బాంబు పేల్చాడు. దాదాపు 70 దేశాలపై తాజాగా సుంకాలను విధిస్తూ కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీంతో, కొత్త టారిఫ్‌లు అమలులోకి రానున్నాయి. కొత్తగా విధించిన వాటిలో అత్యధికంగా సిరియాపై 41 శాతం టారిఫ్‌లను ట్రంప్‌ ప్రకటించారు. కెనడాపై 35 శాతానికి సుంకాలను పెంచారు. ఇక, భారత్‌పై 25 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే.

వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కొత్తగా టారిఫ్‌లను విధించారు. డజన్ల కొద్దీ వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలను విధించారు. సిరియాపై అత్యధికంగా 41 శాతం విధించగా.. కెనడాపై 25 శాతం నుంచి 35 శాతానికి సుంకాల పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 

అలాగే, లావోస్‌, మయన్మార్‌పై 40 శాతం, స్విట్జల్యాండ్‌పై 39 శాతం, ఇరాక్‌, సెర్బియాపై 35 శాతం పన్నులు విధించారు. భారత్‌పై 25 శాతం, పాకిస్తాన్‌పై 19 శాతం, బంగ్లాదేశ్‌పై 20శాతం, శ్రీలంకపై 20 శాతం టారిఫ్‌లు విధిస్తూ.. ఉత్తర్వులపై సంతకం చేశారు.

 


ఇదిలా ఉండగా.. బ్రిక్స్‌ దేశాలపై సుంకాల మోత మోగిస్తానన్న ట్రంప్‌ అన్నంత పని చేశారు. భారత్‌పై 25శాతం సుంకాలను విధించిన ఆయన.. బ్రెజిల్‌పై సుంకాలను ఏకంగా 50శాతానికి పెంచారు. శుక్రవారం నుంచే ఇవి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. మరోవైపు పొరుగుదేశం మెక్సికోపై కొంత కరుణ చూపారు. ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం కోసం 90 రోజుల సమయమిచ్చారు. అయితే ఈ సమయంలో 25శాతం సుంకం అమల్లో ఉంటుందని గురువారం ప్రకటించారు.

భారత్‌పై 25 శాతం సుంకాలు పెనాల్టీతో కలిపి ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు చెప్పారు. ‘భారత్‌ మిత్రదేశమే అయినా.. సుంకాలు ఎక్కువగా ఉన్నందున వారితో పరిమిత స్థాయిలోనే వ్యాపారాలు చేస్తున్నాం. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్‌ ఒకటి. రష్యా నుంచి భారీ స్థాయిలో సైనిక ఉత్పత్తులు, చమురు కొనుగోలు చేస్తోంది. అందుకే 25 శాతం సుంకాలు, అదనంగా పెనాల్టీ కూడా విధిస్తున్నాం. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి’ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ట్రంప్‌ ప్రకటనపై భారత్‌ స్పందించింది. తాజాగా కేంద్రం ఓ ప్రకటనలో..‘ద్వైపాక్షిక వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటనను గమనించాం. సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నాం. రైతులు, వ్యాపారవేత్తలతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. బ్రిటన్‌తో ఇటీవల కుదుర్చుకున్న ‘ఎఫ్‌టీఏ’ సహా ఇతరత్రా వాణిజ్య ఒప్పందాల మాదిరిగానే.. ఈ వ్యవహారంలోనూ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం’ అని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement