
ఒట్టావా: ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో పాలస్తీనాను గుర్తించే విషయంలో ఫ్రాన్స్, యూకేల బాటలో పయనించాలని కెనడా నిర్ణయించుకుంది. గాజాలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న అరాచకాలకు నిరసనగా పాలస్తీనా దేశాన్ని గుర్తించాలనుకుంటున్న కెనడా ప్రధాని మార్క్ కార్నీ బుధవారం ప్రకటించారు. శాంతియుతంగా చర్చల ద్వారా ఇజ్రాయెల్– పాలస్తీనా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తమకు నమ్మకం పోయిందని ఆయన వివరించారు.
అందుకే సెప్టెంబర్‌లో జరిగే ఐరాస జనరల్ అసెంబ్లీ 80వ సెషన్‌లో పాలస్తీనా దేశాన్ని గుర్తించాలని అనుకుంటున్నామన్నారు. అయితే, సంస్కరణలతో, 2026లో సాధారణ ఎన్నికలు జరిపేందుకు పాలస్తీనా అథారిటీ నుంచి గట్టి హామీ లభించాల్సి ఉందన్నారు. భవిష్యత్తులో పాలస్తీనాలో హమాస్‌కు ఎటువంటి పాత్ర ఉండరాదని, ఎన్నికల్లో పాల్గొనరాదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి బదులుగా శాంతిని కోరుకునే ప్రజలందరి కోసమే రెండు దేశాల విధానాన్ని బలపరుస్తున్నామని కార్నీ తెలిపారు.