
తీవ్రంగా తప్పుబట్టిన చైనా
వాషింగ్టన్/బీజింగ్: బ్రిక్స్ కూటమివి అమెరికా వ్యతిరేక విధానాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఆ కూటమికి మద్దతిచ్చే ఏ దేశమైనా తమనుంచి 10 శాతం అదనపు సుంకాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని సోమవారం హెచ్చరించారు. ‘‘బ్రిక్స్ అమెరికా వ్యతిరేక విధానాలతో జతకట్టే ఏ దేశం మీదైనా అదనంగా 10% సుంకం విధిస్తాం. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఉండవు’’ అని ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు.
కొత్త టారిఫ్ నియమాలు, సవరించిన వాణిజ్య ఒప్పంద నిబంధనలను వివరిస్తూ ఆయా దేశాలకు తక్షణం అధికారిక లేఖలు పంపుతున్నట్టు ప్రత్యేక పోస్టులో తెలిపారు. ట్రంప్ ప్రకటనను చైనా తీవ్రంగా ఖండించింది. ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఇలా సుంకాలను ఆయుధంగా వాడటం దారుణమని మండిపడింది. ఇది ఎవరికీ లాభం చేయబోదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. ‘‘అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారానికి బ్రిక్స్ ఒక వేదిక. అది ఏ దేశానికీ వ్యతిరేకంగానో, లక్ష్యంగానో లేదు’’ అని స్పష్టం చేశారు.
ఖండించిన రియో డిక్లరేషన్
బ్రెజిల్‌లోని రియోడి జనీరోలో జరిగిన బ్రిక్స్ తాజా శిఖరాగ్ర సమావేశం అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారింది. ట్రంప్ సుంకాల విధానాలను బ్రిక్స్ దేశాధినేతలు తీవ్రంగా విమర్శించారు. ‘రియో డి జనీరో డిక్లరేషన్’లో ఈ మేరకు స్పష్టంగా పేర్కొన్నారు. ‘‘సుంకాలను విచక్షణారహితంగా పెంచడం ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీసి మరింత తగ్గించే ప్రమాదముంది. ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాల్లో అనిశ్చితికి కారణమవుతుంది’’ అని పేర్కొన్నారు.
ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నియమాల ఆధారిత, బహిరంగ, పారదర్శక, న్యాయమైన, సమానమైన బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థకు తమ మద్దతును పునరుద్ఘాటించారు. అనంతరం దీనిపై ట్రంప్ మరోసారి తీవ్రంగా ప్రతిస్పందించారు. అమెరికా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న దేశాలపై 10% అదనపు సుంకాలు తప్పవని పునరుద్ఘాటించారు. భారత్‌తో సహా అనేక దేశాల దిగుమతులపై అదనపు సుంకాలను ప్రకటించిన ట్రంప్ తర్వాత వాటి అమలును 90 రోజుల పాటు నిలిపేయడం తెలిసిందే. ఆ గడువు జూలై 9తో ముగుస్తుంది. తదనంతరం అమెరికా మార్కెట్లోకి ప్రవేశించే భారత వస్తువులపై అదనంగా 26 శాతం దిగుమతి సుంకం పడుతుంది. ప్రస్తుత సుంకాల బెదిరింపులతో ఆ భారాన్ని మరింత పెంచనుంది.