
వాషింగ్టన్: దేశ రాజధాని వాషింగ్టన్ డీసీ హింసాత్మక గ్యాంగ్‌లు, రక్తపిపాసులైన నేరగాళ్లతో నిండిపోయిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు రాజధానిలోని పోలీసు విభాగాన్ని ఫెడరల్ నియంత్రణలోకి తీసుకుంటున్నామని చెప్పారు. పోలీసులకుతోడుగా 800 మంది నేషనల్ గార్డ్స్‌ను కూడా మోహరిస్తామని ప్రకటించారు. నేషనల్ గార్డులు శాంతిభద్రతలను, పౌరులకు రక్షణను కల్పిస్తారన్నారు.
అవసరమైతే మరింతమంది నేషనల్ గార్డులను తీసుకొస్తామని పేర్కొన్నారు. సోమవారం ఆయన వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. నగరంలో నేరాల రేటు 2024లో 30 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందంటూ గణాంకాలు చెబుతుండగా నేరాలమయంగా మారిందని వ్యాఖ్యానించడం గమనార్హం. ట్రంప్ ఈ వారంలోనే ఫెడరల్ బలగాలు రాజధానికి చేరుకుంటాయని రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు.
నిరాశ్రయులు నగరం విడిచి వెళ్లిపోవాలి
‘నివాసం లేని వారు వెంటనే నగరం వదిలి వెళ్లిపోవాలి. వారి కోసం నగరానికి దూరంగా స్థలాలిచ్చాం. నేరగాళ్లూ, మీరు మాత్రం ఎక్కడికీ వెళ్లొద్దు, మీరుండాల్సింది జైలులోనే. మేమే మిమ్మల్ని అందులో ఉంచుతాం’అని ట్రంప్ అంతకుముందు సొంత ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. వీధుల్లో, పార్కుల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారిని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ ఫెడరల్ పోలీసులకు ఆదేశాలిచ్చామన్నారు.