అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: దశాబ్దాల క్రితంనాటి తొలితరం అణుబాంబు ధాటికే హిరోషిమా, నాగసాకి నగరాలు తుడిచిపెట్టుకుపోయిన దారుణోదంతాలను చవిచూసిన ప్రపంచానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో చెడువార్తను మోసుకొచ్చారు. గత ఒడంబడికలను బుట్టదాఖలుచేస్తూ ఇకపై తాము అణుపరీక్షలు చేపడతామని ట్రంప్ సోమవారం ప్రకటించారు.
తాము మాత్రమే అణుపరీక్షలు చేయట్లేమని, ఇప్పటికే పాకిస్తాన్, చైనా ఈ పని మొదలెట్టాయని ఆయన కొత్త విషయం చెప్పారు. సీబీసీ న్యూస్ ఛానల్ వారి నోరా ఓ డేనియల్ ఇంటర్వ్యూలో ట్రంప్ పలు విషయాలను వెల్లడించారు. ‘‘ రష్యా అణు పరీక్షలు చేస్తోంది. చైనా తక్కువేం తినలేదు. అదికూడా అణుపరీక్షలు చేస్తోంది. ఈ విషయాన్ని అవి బహిరంగంగా చెప్పట్లేవు. మేం అలా కాదు. మేం అన్నీ చెప్పేస్తాం. అమెరికా సైతం అణుపరీక్షలు చేయబోతోంది.
ఎందుకంటే వాళ్లంతా చేస్తున్నారుగా. ఉత్తర కొరియా ఇప్పటికే అణుపరీక్షలు చేసేసింది. పాకిస్తాన్ ఇప్పుడు చేస్తోంది’’ అని ట్రంప్ చెప్పారు. ‘‘ కొన్ని దేశాలు తమ అణు పరీక్షల వివరాలను బహిర్గతంచేయట్లేవు. ఆ అణుపరీక్షలు భూగర్భంలో జరుగుతున్నాయో. దాంతో అవి ఎప్పుడు ఎక్కడ జరుగుతున్నాయో ఎవరికీ తెలీవు. కేవలం సూక్ష్మస్థాయిలో ప్రకంపనలు మాత్రమే వస్తాయి.
ఈ నేపథ్యంలో అమెరికా పరీక్షలు జరపడం సబబే’’ అని ట్రంప్ తన నిర్ణయాన్ని సమరి్థంచుకున్నారు. ‘‘అణ్వాయుధాలను తయారుచేశాక వాటిని పరీక్షించకుండా ఉంటే ఎలా? అవి పనిచేస్తున్నాయో లేదో తెలియాలంటే పరీక్షించాలి కదా. అయినా ఇతర దేశాలు అణుపరీక్షలు జరుపుతూ అణ్వ్రస్తాలను పెంచుకుంటున్నాయి. అమెరికా సైతం తగు నిల్వలను సముపార్జించాలి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.  
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు 
చైనా, పాక్‌లు కొత్తగా అణుపరీక్షలు జరుపుతోందన్న ట్రంప్ వ్యాఖ్యలతో సరిహద్దున పొరుగుదేశంతో భారత్‌కు అణుముప్పు పెరిగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటికే భారత్ కంటే అత్యధికంగా చైనా వద్ద ఏకంగా 600 అణ్వాయుధాలు ఉన్నాయి. మరో ఐదేళ్లలో వీటి సంఖ్య 1,000కి చేరుకోనుంది. పాకిస్తాన్ వద్ద 170 అణ్వాయుధాలున్నాయి. భారత్ వద్ద 180 అణువార్‌హెడ్‌లు ఉన్నాయి. అంతర్జాతీయ అధికారిక రికార్డ్‌ల ప్రకారం రష్యా 1990తర్వాత అణుపరీక్షలు జరపలేదు. చైనా 1996 తర్వాత, భారత్ 1998 మే తర్వాత అణుపరీక్షలు చేయలేదు.  

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
