'మనం కలిసికట్టుగా విజయం సాధిద్దాం'

Together We Will Win: France PM Macrons Message To India - Sakshi

భారత్‌కు ఆక్సిజన్‌ జనరేటర్లు, కంటైనర్లు పంపిస్తాం

భారత్‌కు సాయంపై ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రన్‌

న్యూఢిల్లీ: కోవిడ్‌ విజృంభణతో అల్లాడుతున్న భారత్‌కు తమవంతుగా పూర్తి సహాయసహకారాలు ఉంటాయని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రన్‌ ప్రకటించారు. ఈ మేరకు హిందీలో ఆయన భారత్‌ను ఉద్దేశిస్తూ ‘మనం కలిసికట్టుగా విజయం సాధిద్దాం’ అంటూ  ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేశారు. కోవిడ్‌పై పోరులో భాగంగా భారత్‌కు త్వరలో ఆక్సిజన్‌ జనరేటర్లు, ద్రవ ఆక్సిజన్‌ కంటైనర్లు, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు, ఔషధాలను సముద్ర, వాయు మార్గంలో ఈ వారం చివరిలోగా పంపిస్తామని మంగళవారం ఫ్రాన్స్‌ తెలిపింది. ‘ భారత్‌లో కోవిడ్‌ చికిత్సలో సదుపాయల కొరత ఉంది. ఈ వైద్య అత్యయక స్థితిని పూర్తిగా అధిగమించేందుకు మేం సాయం చేస్తాం. కష్టకాలంలో ఇరు దేశాలు ఇలా గతంలోనూ ఒకరికొకరు ఎంతగానో సాయపడ్డాయి’ అని ఫ్రాన్స్‌ యూరప్, విదేశీ వ్యవహారల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫ్రాన్స్‌ పంపే ఒక్కో ఆక్సిజన్‌ జనరేటర్‌ ఏకంగా 250 పడకలున్న ఆస్పత్రికి నిరంతరాయంగా పదేళ్లపాటు ఆక్సిజన్‌ అందించే సామర్థ్యం గలది. వీటితోపాటు ఐదు ద్రవ ఆక్సిజన్‌ కంటైనర్లను పంపనుంది. రోజుకు 10వేల మంది రోగులకు ఆక్సిజన్‌ను అందించే సామర్థ్యం వీటి సొంతం. 200 ఎలక్ట్రిక్‌ సిరంజీ పంపులు, 28 వెంటిలేటర్లు భారత్‌కు చేరనున్నాయి.  

ఐర్లాండ్‌ నుంచి 700 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు 
భారత్‌కు తాము చేస్తామని ఐర్లాండ్‌ మంగళవారం ప్రకటించింది. 700 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను పంపిస్తామని తెలిపింది. బుధవారం ఉదయంకల్లా భారత్‌కు తీసుకొస్తామని ఐర్లాండ్‌ రాయబార కార్యాలయం పేర్కొంది. వెంటిలేటర్లనూ భారత్‌కు తరలించనుంది.  

ఆస్ట్రేలియా నుంచి 500 వెంటిలేటర్లు
కోవిడ్‌పై పోరాడుతున్న భారత్‌కు తమ వంతు సాయగా 500 వెంటిలేటర్లు, పది లక్షల సర్జికల్‌ మాస్క్‌లు, ఐదు లక్షల ప్రొటెక్టివ్‌ మాస్క్‌లు, ప్రత్యేక కళ్లద్దాలు, ఫేస్‌ షీల్డులను పంపిస్తామని ఆస్ట్రేలియా మంగళవారం ప్రకటించింది. మరోవైపు, భారత్‌ నుంచి నేరుగా విమాన సర్వీసులను మే 15వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు ఆస్ట్రేలియా వెల్లడించింది. మే 15 తర్వాత పరిస్థితులను సమీక్షించాక విమానసర్వీస్‌ల పునరుద్దరణపై నిర్ణయం తీసుకుంటామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ చెప్పారు. 

ఈయూ సభ్య దేశాల నుంచి భారత్‌కు వైద్య సాయం
యురోపియన్‌ యూనియన్‌(ఈయూ)లో సభ్య దేశాలైన బెల్జియం, లక్సెంబర్గ్, పోర్చుగల్, స్వీడన్‌లు సైతం భారత్‌కు తోచిన సాయం చేస్తున్నాయి. జర్మనీ సహా పలు సభ్య దేశాలు భారత్‌కు సాయపడటంతో నిమగ్నమయ్యాయని ఈయూ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. 9వేల డోస్‌ల రెమ్‌డెసివర్‌ ఔషధాన్ని బెల్జియం పంపిస్తోంది. 120 వెంటిలేటర్లను స్వీడన్‌ తరలిస్తోంది. 80 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, 75 ఆక్సిజన్‌ సిలిండర్లను రుమేనియా సరఫరా చేయనుంది. లక్సెంబర్గ్‌ 58 వెంటిలేటర్లను, 5,503 వయల్స్‌ల రెమ్‌డెసివర్‌ను, వారానికి 20వేల లీటర్ల ఆక్సిజన్‌ను పోర్చుగల్‌ భారత్‌కు తరలించనుంది.  

కాలిఫోర్నియా రాష్ట్రం నుంచీ..
అత్యంత ఎక్కువగా ప్రవాస భారతీయులు నివసించే అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సైతం భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. 275 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, 440 ఆక్సిజన్‌ సిలిండర్లు, 240 ఆక్సిజన్‌ రెగ్యులేటర్లు, పల్స్‌ ఆక్సీమీటర్లు, నిమిషానికి 120 లీటర్ల ఆక్సిజన్‌ను సరఫరా చేయగల డిప్లోయబుల్‌ ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ సిస్టమ్‌(డీఓసీఎస్‌)ను భారత్‌కు పంపిస్తామని కాలిఫోర్నియా గవర్నర్‌ గవీన్‌ న్యూసమ్‌ చెప్పారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top