ఖమేనీ అంత్యక్రియల్లో కీలక నేతలు | Three sons of Iran slain leader Khamenei appear at funeral | Sakshi
Sakshi News home page

ఖమేనీ అంత్యక్రియల్లో కీలక నేతలు

Jul 6 2026 5:52 AM | Updated on Jul 6 2026 5:52 AM

Three sons of Iran slain leader Khamenei appear at funeral

కార్యక్రమంలో ఖమేనీ ముగ్గురు కుమారులు

మొజ్తబా మినహా హాజరైన ఖమేనీ ముగ్గురు కుమారులు

92 ఏళ్ల అయతొల్లా జాఫర్‌ సొభానీ సారథ్యంలో ప్రార్థనలు

టెహ్రాన్‌: దివంగత అయతొల్లా ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనల్లో ఇరాన్‌ అగ్రనాయకులు, నూతన సుప్రీం నేత మొజ్తబా సోదరులు ఆదివారం ప్రజల ముందుకు వచ్చారు. కొత్త సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ ఇప్పటికీ బయటకు కనిపించలేదు. అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో తండ్రి ఖమేనీ, తదితరులు చనిపోగా మొజ్తబా తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నారు. కాగా, ఖమేనీ శవపేటికను సోమవారం టెహ్రాన్‌లో ఊరేగించనున్నారు. దీనికోసం, యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపట్టింది. నగరంలో వాహనాల రాకపోకలను, ఇతర కార్యక్రమాలను నిలిపివేసింది.

అమెరికా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యుల కోసం టెహ్రాన్‌లోని గ్రాండ్‌ మొసల్లాలో జరిగిన ప్రార్థనలకు 97 ఏళ్ల షియా మత పెద్ద అయతొల్లా జాఫర్‌ సొభానీ సారథ్యం వహించారు. పెద్ద సంఖ్యలో జనం హాజరైన ఈ ప్రార్థనల్లో ఖమేనీ కుమారులు మసూద్, మేసమ్, మొస్తాఫా పాల్గొన్నారు. యుద్ధం మొదలైన తర్వాత వీరు కినిపించడం ఇదే మొదటిసారి. రివల్యూషనరీ గార్డ్స్‌ విభాగం అధిపతి జనరల్‌ అహ్మద్‌ వాహిది సైతం వచ్చారు. నల్ల బేస్‌బాల్‌ టోపీ ధరించిన ఆయన చుట్టూ సాధారణ దుస్తుల్లో వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉన్నారు.

మొజ్తబాకు అత్యంత సన్నిహితుడుగా భావిస్తున్న వాహిది అమెరికాతో చర్చల్లో వ్యూహాత్మకంగా ఇరాన్‌ పైచేయి సాధించడం వెనుక కీలకంగా ఉన్నారని సమాచారం. వీరితోపాటు అధ్యక్షుడు పెజెష్కియాన్, పార్లమెంట్‌ స్పీకర్‌ మహ్మద్‌ బఘెర్‌ ఘాలిబాఫ్, రివల్యూషనరీ గార్డ్స్‌లోని కీలకమైన ఖుద్స్‌ ఫోర్స్‌ అధిపతి ఇస్మాయిల్‌ ఖానీ కూడా కనిపించారు.

ప్రార్థనలకు ముందు జరిగిన ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన కవి మహ్మద్‌ రసౌలి అమెరికా నశించాలి!, ’ఇజ్రాయెల్‌ నశించాలి! అంటూ నినదించారు. ఈ సందర్భంగా రసౌలి ఉద్రేకపూరిత ప్రసంగం చేశారు. ప్రపంచంలోనే అత్యంత దుర్మార్గుడైన ఆ వ్యక్తి ఇంకా ఎందుకు బతికే ఉన్నాడు? అంటూ ట్రంప్‌ నుద్దేశించి ప్రశ్నించారు. ట్రంప్‌ ఉండాల్సిన చోటు కాదిది అని రసౌలి పేర్కొనడగా జనం పెద్ద పెట్టున కేరింతలు కొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement