Ayman Al-Zawahiri: జవహరీ హతం.. అమెరికన్లూ జాగ్రత్త! ప్రమాదం ఏ రూపంలోనైనా రావొచ్చు

Terrorist Organisations Plan Attacks Against US People - Sakshi

వాషింగ్టన్‌: అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీ హత్య తర్వాత అమెరికన్లపై ప్రతీకార దాడులు జరిగే ప్రమాదం ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ హెచ్చరించింది. అల్‌ఖైదా అనుబంధ ఉగ్రసంస్థలు, సానుభూతిపరులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా పౌరులు, కార్యాలయాలను లక్ష‍్యంగా చేసుకుని దాడులకు పాల్పడే అవకాశముందని చెప్పింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అమెరికన్లు, మున్ముందు విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకునే పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉగ్రసంస్థలు వివిధ దేశాల్లో దాడులకు పాల్పడే అవకాశముందని ప్రస్తుతం తమకు అందుబాటులో ఉన్న సమాచారం సూచిస్తోందని విదేశాంగ శాఖ చెప్పింది. ఆత్మాహుతి దాడులు, హత్యలు, కిడ్నాప్‌లు, బాంబుపేలుళ్లు ఇలా ఏ రూపంలోనైనా ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించవచ్చని చెప్పింది. పరిస్థితిని అర్థం చేసుకుని అమెరికన్లంతా అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.

అల్‌ జవహరీని అమెరికా డ్రోన్ దాడులు నిర్వహించి హతమార్చింది. కాబూల్‌ ఓ ఇంట్లో తలదాచుకున్న అతడిపై డ్రోన్లతో క్షిపణి దాడులు చేసి అంతం చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. జవహరీ మృతితో 9/11 ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు న్యాయం చేసినట్లయిందని పేర్కొన్నారు.

మరోవైపు ఈ దాడిని తాలిబన్లు ఖండించారు. అమెరికా అంతర్జాతీయ నిబంధనలను అతిక్రమించిందని, 2000 సంవత్సరంలో కుదిరిన ఒప్పందాలను విస్మరించిందని ఆరోపించారు.
చదవండి: రెండు దశాబ్దాల వేట.. అల్ ఖైదా చీఫ్‌ను అమెరికా ఎలా మట్టుబెట్టిందంటే?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top