8 మంది లంక క్రికెటర్ల నిర్ణయం
పాకిస్తాన్‌తో నేటి రెండో వన్డేపై నీలినీడలు
ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడితో భయాందోళనలు
కొలంబో: ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెట్ జట్టును తాజా ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడి ఘటన కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మంగళవారం జరిగిన ఈ హేయమైన ఉగ్రదాడిలో 12 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఈ దాడి లంక జట్టులో భయాందోళనలు పెంచింది. ఏకంగా 8 మంది ఆటగాళ్లు తిరుగుముఖం పట్టాలని నిర్ణయించుకున్నారు.
షెడ్యూల్ ప్రకారం మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ గురువారం రావల్పిండిలో జరగాల్సి ఉంది. సింహళ క్రికెటర్లు స్వదేశానికి పయనమైతే నేటి వన్డే మ్యాచ్ రద్దయ్యే అవకాశాలున్నాయి. తొలి వన్డే నెగ్గిన పాక్ 1–0తో ఆధిక్యంలో ఉంది. ఇది మగిశాక జింబాబ్వే మూడో జట్టుగా పాల్గొనే ముక్కోణపు టి20 సిరీస్‌లోనూ లంక తలపడాల్సి ఉంది. దీంతో ఈ నెలాఖరుదాకా బిక్కుబిక్కుమంటూ పాక్‌లో ఉండలేమని లంక క్రికెటర్లు పేర్కొంటున్నారు.
అయితే లంక బోర్డు (ఎస్‌ఎల్‌సీ) మాత్రం షెడ్యూల్ ప్రకారమే తమ జట్టు పాక్ పర్యటనను ముగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అవసరమైతే 8 మంది క్రికెటర్లను రిజర్వ్ బెంచ్‌తోనైనా భర్తీ చేసేందుకు సిద్ధమని లంక బోర్డు సూచనప్రాయంగా పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు అభయమిచ్చినట్లు తెలిసింది. సరిగ్గా 16 ఏళ్ల క్రితం పాక్ పర్యటనకు వెళ్లిన లంక బృందంపై పాక్ ఉగ్రమూక దాడిచేసింది. ఈ ఘటనలో పలువురు లంక క్రికెటర్లు తూటా గాయాలకు గురయ్యారు.


