రిమ్స్ ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతోన్న దళిత విద్యార్థిని
పొందూరు కేజీబీవీలో ఇటీవల ఆత్మహత్యకు ప్రయత్నించిన ఇంటర్ విద్యార్థిని వెల్లడి
మీరు ఎస్సీ వాళ్లు అసహ్యంగా ఉంటారు.. మీ పక్కన నిల్చోవాలంటే చాలా అసహ్యం
మీ అమ్మ బ్యాండ్ మేళానికి వెళ్తుంది కదా? నీవు కూడా వెళ్తావా?
మీరు ఎందుకింత మురికిగా ఉన్నారు?
మీ అమ్మ తప్పుడు మనిషి కదా?
ఇలా కులం పేరిట అసభ్య మాటలతో తీవ్రంగా టార్చర్ చేశారు
తన తల్లి గురించి కూడా తప్పుడు మాటలు మాట్లాడారని బాలిక ఆవేదన
శ్రీకాకుళం క్రైమ్: ‘నేను బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి, రెండు కాళ్లు విరిగి నా చదువు అర్ధంతరంగా ఆగిపోవడానికి ప్రిన్సిపాల్ సీపాన లలిత కారణం’ అని శ్రీకాకుళం జిల్లా పొందూరు కసూ్తర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో రెండు నెలల కిందట ఆత్మహత్యకు ప్రయత్నించిన దళిత విద్యార్థిని తెలిపింది. కులం పేరుతో తనను, తన తల్లిని ప్రిన్సిపాల్ తీవ్రంగా దూషించడం వల్లే చనిపోవాలని ప్రయత్నించానని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్‌లోని ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్న ఆ విద్యార్థిని గురువారం మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను తెలియజేసింది. ‘మీరు ఎస్సీ వాళ్లు అసహ్యంగా ఉంటారు. మీ ఎస్సీ కాలనీలో నుంచి రావాలంటే చాలా చిరాకుగా ఉంటుంది.
ఇప్పుడు మీరు మా హాస్టల్‌లో జాయిన్ అయ్యారు. మీ పక్కన నిల్చోవాలంటే చాలా అసహ్యం. మీ అమ్మ బ్యాండ్ మేళానికి వెళ్తుంది కదా? నీవు కూడా వెళ్తావా? మీరు ఎందుకింత మురికిగా ఉన్నారు. మీ అమ్మ తప్పుడు మనిషి కదా? నువ్వు అబ్బాయిలా బిహేవ్ చేస్తున్నావు. పీజీటీ మేడమ్స్ ఏమైనా నీకు తప్పుడు పనులు నేర్పిస్తున్నారా?’ అని ఎస్‌వో(ప్రిని్సపాల్) మేడమ్ తరచూ వేధించేవారు అని విద్యార్థిని ఆవేదన వ్యక్తంచేసింది. అంతేకాకుండా తనపై తన తల్లిపై పలు తప్పుడు వదంతులు వ్యాప్తిచేశారని తెలిపింది. ఏఎన్‌ఎం, అటెండర్, అకౌంటెంట్ సర్ కూడా వేధించారు.
ఇలా తరచూ అసభ్య మాటలతో వేధించడం వల్లే అందరూ పడుకున్నాక బిల్డింగ్‌పై నుంచి దూకేశానని తెలిపింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్న తనవద్దకు ఏపీసీ సర్, ప్రిని్సపాల్ మేడమ్ వచ్చి బెదిరించారని, అందువల్లే అప్పుడు కాలుజారి పడిపోయినట్లు పోలీసులకు తప్పుగా చెప్పానని వివరించింది. రెండు నెలలుగా రిమ్స్‌లో చికిత్స పొందుతున్నానని, కుడి కాలికి ఆరు ఆపరేషన్లు అయ్యాయని, ఎడమ కాలికి పిండికట్టు కట్టారని, పట్టించుకునే నాథుడే లేరని ఆ విద్యార్థిని వాపోయింది.
న్యాయం చేస్తామని తప్పించుకున్నారు: విద్యార్థిని తల్లి
తన భర్త చనిపోయాక కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్నానని బాలిక తల్లి లక్ష్మి తెలిపారు. తన కుమార్తెను ఆరో తరగతి నుంచి కేజీబీవీలోనే చదివించానని చెప్పారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్న తన కుమార్తె వద్దకు తాను లేని సమయంలో ప్రిన్సిపాల్ లలిత, ఏపీసీ వచ్చి తప్పుగా స్టేట్‌మెంట్ ఇప్పించారని పేర్కొన్నారు. ఆ రోజు వారిని ప్రశ్నిస్తే న్యాయం చేస్తామని చెప్పి తప్పించుకున్నారని తెలిపారు.
ఇప్పటి వరకు వారి నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి సాయం అందలేదన్నారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై గత నెల 25న శక్తి యాప్‌లో, పది రోజుల క్రితం పొందూరు పోలీస్‌స్టేషన్‌లో, గత నెల 15న నేషనల్ చైల్డ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశామన్నారు. అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు.


