Afghanistan: అఫ్గాన్‌లో తాలిబన్‌ రాజ్యం

Taliban enters Kabul, awaits peaceful transfer of power  - Sakshi

రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించిన తాలిబన్లు

తలవంచిన అష్రాఫ్‌ ఘనీ ప్రభుత్వం

రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోయిన అష్రాఫ్‌ ఘనీ

శాంతియుతంగా అధికార మార్పిడి జరగాలి

తాలిబన్‌ ప్రతినిధుల స్పష్టీకరణ

కో–ఆర్డినేషన్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేస్తామన్న హమీద్‌ కర్జాయ్‌

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ పునర్నిర్మాణం ఒక విఫల ప్రయోగంగానే మిగిలిపోయింది. అమెరికా, నాటో బలగాల ఉపసంహరణ తాలిబన్లకు అందివచ్చిన అవకాశం మారింది. దేశాన్ని మళ్లీ స్వాధీనం చేసుకున్నారు. ఇక పూర్తి అధికారాన్ని దక్కించుకొనే దిశగా అడుగులేస్తున్నారు. అందరూ ఊహించనట్లుగానే తాలిబన్లు ఆదివారం అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌లోకి దర్జాగా ప్రవేశించారు. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ఈ చారిత్రక నగరంలో పాగా వేశారు.

తాము ఎవరిపైనా దాడులు చేయబోమని, ప్రభుత్వం బేషరతుగా లొంగిపోవాలని తాలిబన్లు నిర్దేశించారు. దీంతో అఫ్గాన్‌ కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదు. శాంతియుతంగా అధికార మార్పిడి కోసం ప్రయత్నిస్తున్నట్లు తాలిబన్‌ ప్రతినిధులు వెల్లడించారు. అఫ్గానిస్తాన్‌ తాలిబన్ల వశం కావడంతో అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ తన పదవికి రాజీనామా చేసి, తన బృందంతో కలిసి దేశం విడిచి వెళ్లిపోయారు. తజకిస్తాన్‌కు వెళ్లి తలదాచుకుంటున్నారు. అఫ్గాన్‌ సర్కారు నుంచి తాలిబన్లకు అధికార బదిలీ ప్రక్రియను పర్యవేక్షించడానికి కో–ఆరి్డనేషన్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయనున్నట్లు మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌ ప్రకటించారు.

అమ్మో... తాలిబన్‌ పాలన
కేవలం వారం రోజుల వ్యవధిలోనే తాలిబన్లు మొత్తం అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించడం గమనార్హం. అఫ్గాన్‌ భద్రతా దళాలను బలోపేతం చేసేందుకు అమెరికా, నాటో ఇప్పటిదాకా వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టినప్పటికీ అదంతా వృథా ప్రయాసగా మారింది. అఫ్గాన్‌ సైన్యం తాలిబన్లకు కనీసం ఎదురు నిలువలేకపోయింది. రాజధాని కాబూల్‌ తాలిబన్ల పరం కావడానికి కనీసం నెల రోజులైనా పడుతుందంటూ అమెరికా సైన్యం వేసిన అంచనాలు తారుమారయ్యాయి. తాలిబన్ల అరాచక పాలనలో బతకలేమంటూ అఫ్గాన్లు, విదేశీయులు  అఫ్గానిస్తాన్‌ నుంచి సాధ్యమైనంత త్వరగా  బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇన్నాళ్లూ దాచుకున్న సొమ్మును వెనక్కి తీసుకొనేందుకు జనం ఏటీఎం కేంద్రాల వద్ద బారులు తీరారు. కొందరు పేదలు తమ ఇళ్లను వదిలేసి పార్కులు, బహిరంగ ప్రదేశాలకు చేరుకుంటున్నారు. తమ పౌరులను అఫ్గాన్‌ నుంచి వెనక్కి రప్పించేందుకు అమెరికాతో సహా చాలా దేశాలు ఆత్రుత పడుతున్నాయి. ఆదివారం కాబూల్‌లోని తమ రాయబార కార్యాలయం నుంచి సిబ్బందిని అమెరికా సైన్యం హెలికాప్టర్లలో కాబూల్‌ ఎయిర్‌పోర్టులోని ఔట్‌పోస్టుకు తరలించింది.

కో–ఆరి్డనేషన్‌ కౌన్సిల్‌  
తాలిబన్లతో చర్చలు జరపడానికి, దేశంలో అధికార బదిలీ ప్రక్రియను పర్యవేక్షించడానికి కో–ఆర్డినేషన్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయనున్నట్లు అఫ్గానిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ కౌన్సిల్‌లో గుల్బుదీన్‌ హెక్మాత్యార్, అబ్దుల్లా అబ్దుల్లాతోపాటు తాను కూడా సభ్యులుగా ఉంటామని తెలిపారు. కాబూల్‌ వీధుల్లో అలజడి, అశాంతిని నియంత్రించాలని తాలిబన్లకు, అఫ్గాన్‌ సైనికులకు హామీద్‌ కర్జాయ్‌ సూచించారు. అఫ్గాన్‌లో శాంతిని స్థాపించేందుకు, అధికార బదిలీ ప్రశాంతంగా పూర్తయ్యేందుకు అందరూ చొరవ తీసుకోవాలని కోరారు. మరోవైపు తాలిబన్ల ముందు తాను ఎప్పటికీ తల వంచబోనని అఫ్గాన్‌ మొదటి ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ తేల్చిచెప్పారు.

ఇకపై ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్తాన్‌
అఫ్గానిస్తాన్‌ పేరును మార్చాలని తాలిబన్లు నిర్ణయించారు. ఇకపై ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్తాన్‌గా పిలవాలని ఆదేశించారు. అధ్యక్ష భవన నుంచే ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. అమెరికా సైన్యం రాకముందు తాలిబన్ల పాలన కొనసాగుతున్నప్పుడు అఫ్గాన్‌కు ఇదే పేరు ఉండేది.  

కాబూల్‌ విమానాశ్రయంలో కాల్పులు!
కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఆదివారం రాత్రి తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. కాబూల్‌ విమానాశ్రయంలో కాల్పులు జరిగినట్లుగా సమాచారం అందుతోందని, అందువల్ల అమెరికన్లు ఎక్కడివారక్కడే సురక్షితంగా తలదాచుకోవాలని సూచించింది. ‘కాబూల్‌లో పరిస్థితి క్షీణిస్తోంది. విమానాశ్రయంలో భద్రత ప్రమాదంలో పడింది. వేగంగా పరిస్థితి దిగజారుతోంది. విమానాశ్రయంలో కాల్పులు చోటుచేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఎక్కడివారక్కడ సురక్షితంగా ఉండండి. రాయబార కార్యాలయంలో అధికారిక విధులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. ఈ సమయంలో ఎవరూ ఎంబసీకి, విమానాశ్రయానికి రావొద్దు’ అని కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.  

జెండాను కూడా తీసుకెళ్లిన అమెరికా
అఫ్గానిస్తాన్‌లో అమెరికా రాయబారి రాస్‌ విల్సన్‌ కాబూల్‌లోని దౌత్య కార్యాలయాన్ని వదిలేసి ఆదివారం విమానాశ్రయానికి వెళ్లిపోయారు. ఎంబసీపై ఎగురుతున్న అమెరికా జాతీయ జెండాను తొలిగించి మరీ వెంట తీసుకుపోయారు. కాగా రాయబార కార్యాలయంలోని ముఖ్యమైన ఫైళ్లను అమెరికా సిబ్బంది దగ్ధం చేశారు. అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు విషమిస్తుండడంతో అమెరికా ప్రభుత్వం మరో 1,000 మంది సైనికులను ఆదివారం కాబూల్‌కు తరలించింది. ఇప్పటికే అక్కడ ఉన్న తమ 4,000 మంది సైనికులకు   సహకరించేందుకు వీరిని కువైట్‌ నుంచి  తరలించినట్లు తెలిపింది.    


అధ్యక్ష భవనం స్వాధీనం  
అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ రాజీనామా చేయడంతో అఫ్గాన్‌ అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. కాబూల్‌లో అల్లర్లు, లూటీలు జరగకుండా నివారించడానికే తాలిబన్లు నగరంలో కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు తాలిబన్‌ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిదీన్‌ ప్రకటించారు. సైనిక దళాలు ఖాళీ చేసిన ఔట్‌పోస్టులను తాము స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రజలెవరూ ఆందోళన చెందాలి్సన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఆదివారం కాబూల్‌ శివార్లలో జరిగిన ఘర్షణల్లో 40 మంది గాయపడినట్లు తెలిసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top