Afghanistan: తొలి ఫత్వా జారీ చేసిన తాలిబన్లు.. అనుకున్నదే అయింది!

Taliban bans co education in Afghanistan Herat province: Report - Sakshi

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు అందరూ భయపడుతున్న విధంగానే మహిళలపై ఉక్కుపాదం మోపే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈక్రమంలోనే కో-ఎడ్యుకేషన్‌ను రద్దు చేస్తూ తొలి ఫత్వా జారీ చేశారు. తమ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యానికి తావేలేదని, అంతా షరియత్‌ చట్టాల ప్రకారమేనని ఇప్పటికే కరాఖండిగా తేల్చి చెప్పిన తాలిబన్లు ఆవైపుగానే  నిర్ణయాలను తీసుకుంటున్నారు. తాజాగా హెరాత్ ప్రావిన్స్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కో-ఎడ్యుకేషన్  విధానాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

మహిళల హక్కులను గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేసిన కొన్ని రోజులకే తాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. తాలిబన్ అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ఆడ, మగ పిల్లలు కలిసి చదువు కోవడాన్ని నిషేధించారు. అంతేకాదు ‘సమాజంలోని అన్ని దుర్మార్గాలకు అదే మూలం' అని వర్ణించడం గమనార్హం. 

చదవండి :  తాలిబన్ల చెరలో అఫ్గన్‌: హృదయ విదారక ఫోటోలు వైరల్‌

వర్సిటీ ప్రొఫెసర్లు, ప్రైవేట్ సంస్థల యజమానులు తాలిబన్ అధికారుల మధ్య సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఖామా ప్రెస్ న్యూస్ ఏజెన్సీ శనివారం నివేదించింది. అఫ్గాన్‌ ఉన్నత విద్యకు చెందిన తాలిబన్‌ ప్రతినిధి ముల్లా ఫరీద్ మూడు గంటలపాటు ఈ సమావేశాన్ని నిర్వహించారు. కో-ఎడ్యుకేషన్‌ను నిలిపివేయాల్సిందేనని, వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పారు. అలాగే మహిళా లెక్చరర్లు కేవలం మహిళా విద్యార్థులకు మాత్రమే బోధించడానికి అనుమతి ఉంటుంది తప్ప, పురుషులకు బోధించే అవకాశం ఉండదని  కూడా వెల్లడించారు. 

చదవండి : Afghanistan: తాలిబన్ల సంచలన ప్రకటన

కాగా గత రెండు దశాబ్దాలలో, అఫ్గాన్‌లోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఇనిస్టిట్యూట్లలో కో-ఎడ్యుకేషన్, జెండర్‌ బేస్‌డ్‌ ప్రత్యేక తరగతుల మిశ్రమ వ్యవస్థను అమలు చేసింది. అధికారిక అంచనాల ప్రకారం హెరాత్‌లో ప్రైవేట్, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో 40వేలమంది విద్యార్థులు, 2వేల లెక్చరర్లు ఉన్నారు.

చదవండి : Afghanistan: ఆమె భయపడినంతా అయింది!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top