స్వదేశానికి తిరిగొచ్చిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స

Sri Lanka Former President Gotabaya Rajapaksa Returns Home - Sakshi

కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయేందుకు కారణమై, ప్రజాగ్రహంతో దేశం విడిచి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స స్వదేశం తిరిగివచ్చారు. ఈ ఏడాది జూలై 13న దేశం విడిచి మాల్దీవులకు వెళ్లారు. అక్కడి నుంచి సింగపూర్‌ పారిపోయిన గొటబయ సుమారు ఏడు వారాల తర్వాత శనివారం తెల్లవారుజామున దేశంలో అడుగుపెట్టారు.  

బ్యాంకాక్‌ నుంచి వయా సింగపూర్‌ మీదుగా కొలంబోలోని బందారనాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి శనివారం వచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ సందర్భంగా ఆయన పార్టీకి చెందిన పలువురు చట్టసభ్యులు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని స్వాగతం పలికారు. భారీ భద్రత నడుమ ఎయిర్‌పోర్ట్‌ నుంచి మాజీ అధ్యక్షుడిగా ఆయనకు కేటాయించిన ప్రభుత్వ అధీనంలోని భవనానికి చేరుకున్నారు గొటబయ.

2019లో శ్రీలంక అధ్యక్ష పదవిని చేపట్టారు గొటబయ రాజపక్స. అయితే, దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తటంతో ప్రజలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలు తీవ్రమవటం వల్ల జులై 9న అధ్యక్ష భవనం నుంచి పరారయ్యారు. నాలుగు రోజుల తర్వాత మిలిటరీ జెట్‌లో మాల్దీవులకు వెళ్లారు. అక్కడి నుంచి సింగపూర్‌ చేరుకున్నారు. తర్వాత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రెండు వారాలకు దౌత్య వీసా ద్వారా థాయిలాండ్‌కు వెళ్లారు.

ఇదీ చదవండి: అమెరికాలో సెటిల్‌ కావడానికి ప్లాన్‌ చేసిన గొటబయా రాజపక్స!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top