సియోల్: దక్షిణ కొరియా మాజీ ప్రధాని హాన్ డక్-సూ కి సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు బుధవారం 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దేశంలో అశాంతిని సృష్టించి, విఫలమైన 'మార్షల్ లా' (సైనిక పాలన) కేసులో ఆయను దోషిగా తేలుస్తూ కోర్టు ఈ తీర్పునిచ్చింది.
76 ఏళ్ల హాన్ డక్-సూ.. క్యాబినెట్ సమావేశంలో అధ్యక్షుడి మార్షల్ లా ఆదేశాలకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రయత్నించారని కోర్టు నిర్ధారించింది. అయితే తాను మార్షల్ లాను వ్యతిరేకించానని హాన్ కోర్టులో చెప్పినప్పటికి.. ఆయన వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. కాగా ఈ తీర్పుపై ఆయన పైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.
అసలేమి జరిగిదంటే?
దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ 2024 డిసెంబర్ లో దక్షిణా కొరియోలో అప్పటి దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఎమర్జెన్సీ మార్షల్ లా(సైనిక పాలన) పాలన విధించారు. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.
ఆ దేశ పార్లమెంటును సైన్యం చుట్టుముట్టడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఎమర్జెన్సీ మార్షల్ లా అమలును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం తీసుకురాగా పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో యూన్ అభిశంసన వేటుకు గురయ్యారు. ఇప్పటికే ఈ కేసులో యూన్ సుక్ యోల్‌కు న్యాయస్థానం 5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.


