42 ఏళ్లకు అమ్మను చూశాడు! | Son Stolen At Birth Reunited With Chilean Mother And Hugs Her For First Time In 42 Years - Sakshi
Sakshi News home page

పొత్తిళ్లలో కన్నుమూశాడనుకుంటే.. 42 ఏళ్లకు అమ్మను చూశాడు!

Published Tue, Aug 29 2023 5:55 AM

Son stolen at birth hugs Chilean mother for first time in 42 years - Sakshi

వాషింగ్టన్‌: దక్షిణ అమెరికా దేశం చిలీలో నెలలు నిండకుండానే జన్మించిన ఓ శిశువు అపహరణకు గురయ్యాడు. కిడ్నాపర్లు ఆ శిశువును అమెరికాకు చెందిన దంపతులకు దత్తతకిచ్చేశారు. ఇది జరిగి 42 ఏళ్లయింది. ప్రస్తుతం అతడి పేరు జిమ్మీ లిపర్ట్‌ థైడెన్‌. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం ఆష్‌బర్న్‌లో ఉంటూ లాయర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, 1970, 80ల్లో నియంత ఫినోచెట్‌ హయాంలో చిలీలో వందలాదిగా శిశువులు అపహరణకు గురయ్యారు.

ఓ స్వచ్ఛంద  సంస్థ సాయంతో వారిలో కొందరు తిరిగి కన్నవారి చెంతకు చేరుతున్నారనే వార్తను మొన్న ఏప్రిల్‌లో థైడెన్‌ చూశాడు. ఆ సంస్థను సంప్రదించి తన డీఎన్‌ఏ వివరాల సాయంతో కన్న తల్లి జాడ కనుక్కున్నాడు. తోబుట్టువులు కూడా ఉన్నట్లు తెలిసింది. ఇంకేముంది? భార్య, ఇద్దరు పిల్లలను తీసుకుని చిలీలోని వల్దీవియాలో ఉండే తల్లి మరియా అంజెలికా గొంజాలెజ్‌ వద్దకు వెళ్లాడు. ‘హాస్పిటల్‌ సిబ్బంది నెలలు నిండని నా కొడుకు చనిపోయాడని చెప్పగా విని, గుండెలవిసేలా రోదించాను. నా చిన్నారి ఎక్కడున్నా సుఖంగా ఉండాలని దేవుణ్ని కోరుకున్నా. నా ప్రార్థన ఫలించింది’అంటూ ఆమె కొడుకును హత్తుకుంది. తల్లి, కొడుకు కలుసుకున్న వేళ ఆ ఊరంతా పండగ చేసుకుంది.

Advertisement
 
Advertisement