హిజాబ్ నిరసనల్లో సోదరుడు మృతి.. అంత్యక్రియల్లో ఏడుస్తూ జుట్టుకత్తిరించుకున్న యువతి..

Sister Of Iran Man Killed In Protests Chops Hair At His Funeral - Sakshi

టెహ్రాన్‌: హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే.  10వ రోజుకు చేరుకున్న ఈ నిరసనలు యావత్ ప్రపంచాన్ని తమవైపు చూసేలా చేశాయి. పలుచోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారి పోలీసులు కాల్పులు జరపడంతో ఇప్పటివరకు 41 మంది చనిపోయారు. 2019 చమురు ధరల ఆందోళనల తర్వాత ఇరాన్‌లో ఇవే అతిపెద్ద నిరసనలు కావడం గమనార్హం.

అయితే నిరసనల్లో భాగంగా ఇటీవల జరిగిన ఓ హింసాత్మక ఘటనలో జవాద్ హెయ్‌దరి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కాల్పుల్లో ఇతను చనిపోయాడు. కాగా.. అంత్యక్రియల్లో అతని సోదరి శోకసంద్రంలో మునిగిపోయింది. హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న అతని మృతికి సంతాపంగా భౌతికకాయం పక్కనే ఏడుస్తూ జుట్టు కత్తిరించుకుంది. ఇందుకు సంబంధించిన హృదయవిదారక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

22 ఏళ్ల మహ్సా అమీని మృతితో ఇరాన్‌లో హిజాబ్ నిరసనలు ఉద్ధృత రూపం దాల్చాయి. ఆమె హిజాబ్ ధరించలేదనే కారణంతో పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీలో దారుణంగా కొట్టడం వల్లే  అమీని చనిపోయిందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. పోలీసులు మాత్రం గుండెపోటు వల్లే ఆమె చనిపోయిందని పేర్కొన్నారు. ఆ తర్వాత హిజాబ్ ఆందోళనలు ఇరాన్‌తో పాటు ప్రపంచ దేశాలకు విస్తరించాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. లండన్‌లోని ఇరాన్ ఎంబసీ ముందు పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ తలెత్తింది.
చదవండి: మరింత మందిని కనండి.. ఇటాలియన్లకు పోప్‌ పిలుపు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top