దేవ్‌బాను ప్రధానిగా నియమించండి

Sher Bahadur Deuba To Be Nepals New Prime Minister Orders Supreme Court - Sakshi

నేపాల్‌ అధ్యక్షురాలికి సుప్రీంకోర్టు ఆదేశాలు

నెలల సంక్షోభానికి తెర

ఖాట్మాండూ: నేపాల్‌ రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చింది. నేపాలీ కాంగ్రెస్‌ చీఫ్‌ షేర్‌ బహదూర్‌ దేవ్‌బాను ప్రధానిగా నియమించా లంటూ నేపాల్‌ సుప్రీంకోర్టు ఆ దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీకి సూచించింది. చీఫ్‌ జస్టిస్‌ చోళేంద్ర షంషేర్‌ రాణా ఆధ్వర్యంలోని రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును సోమవారం వెలువరిం చింది. మంగళవారంలోగా దేవ్‌బాను ప్రధానిగా నియమించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జూలై 18 సాయంత్రం 5 గంటలకు సభ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నేపాల్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 76 (5) ప్రకారం ప్రధానిని ఎన్నుకొనే ఓటింగ్‌లో పార్టీ విప్‌ ఏ మాత్రం పని చేయబోదని సీజే జస్టిస్‌రాణా తెలిపారు.

రాజ్యాంగ విరుద్ధం
నేపాల్‌ ప్రధాని కేపీ ఓలీ శర్మ ప్రతిపాదన మేరకు పార్లమెంట్‌దిగువ సభను అధ్యక్షురాలు రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాజాగా ఎన్నికలు నిర్వహించాలన్న ఓలీ నిర్ణయం దీంతో బెడిసికొట్టింది. నవంబర్‌ 12, 19లో ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే.  

దేవ్‌బాకు మద్దతు
దిగువ సభను రద్దు చేయడంపై సుప్రీంకోర్టులో మొత్తం 30 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో 146 మంది ప్రతిపక్ష పార్టీ నేతలు కలసి వేసిన పిటిషన్‌ కూడా ఉంది. మెజారిటీకి అవసరమైన మద్దతు తమ సంకీర్ణ కూటమిలో ఉన్నందున అవకాశం ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టులో వాదించారు. దీంతో సుప్రీంకోర్టు ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా తీర్పు చెప్పింది. కూటమిలో సభ్యుడైన నేపాల్‌ కమ్యూనిస్ట్‌పార్టీ–యూఎంఎల్‌ నేత మాధవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. చేయాల్సి ందంతా సుప్రీంకోర్టు చేయడంతో ఇక తామేమీ మాట్లాడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

దేవ్‌బా గతంలో నాలుగు సార్లు ప్రధానిగా పని చేశారు. 1995–97, 2001–02, 2004–05, 2017–18 మధ్య ఆయన ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. తాజా తీర్పుతో అయిదోసారి ప్రధాని కానున్నారు. మరోవైపు ఓలీ మద్దతుదా రులు సుప్రీంకోర్టు తీర్పుపై నిరసనలు చేపట్టారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నింటిని మేము పాటించాల్సిన అవసరం లేదు అని నినాదాలున్న కార్డులను పట్టుకొని వీధుల్లో నిరసనలు తెలిపారు. ఓలీ నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం పార్లమెంటు విశ్వాసం కోల్పోవడంతో గద్దె దిగాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top