
ఖాట్మండు/న్యూఢిల్లీ: నేపాల్‌లో అస్థిరత కారణంగా మెరుగైన జీవితం కోసం భారత్‌లోకి నేపాలీలు చొరబడే ప్రమాదం ఉండటంతో 1,751 కి.మీ.ల పొడవైన సరిహద్దు వెంట సశస్త్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బీ) బలగాలు కాపలాను కట్టుదిట్టం చేశాయి. సున్నితమైన పాయింట్లతోపాటు బోర్డర్ పోస్ట్‌ల వద్ద భద్రతను మరింత పెంచారు. 22 ఔట్‌పోస్ట్‌ల వద్ద అదనపు బలగాలను రప్పించారు. పోలీస్, ఎస్‌ఎస్‌బీ బృందాలు పెట్రోలింగ్‌ను తీవ్రతరంచేశాయని ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ పోలీస్ సూపరింటెండెంట్ వికాస్ చెప్పారు.
భారతీయులకు అడ్వైజరీ జారీ
సంక్షోభ నేపాల్‌కు వెళ్లొద్దని భారతీయులకు భారత విదేశాంగ శాఖ మంగళవారం ఒక అడ్వైజరీ జారీచేసింది. వివిధ కారణాలతో ఇప్పటికే నేపాల్‌లో ఉన్న భారతీయులు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరిగే ప్రాంతాల వైపు వెళ్లొద్దని సూచించింది. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాటని, భారతీయ రాయబార కార్యాలయం, కాన్సులేట్‌లో అత్యవసరమైతే సంప్రతింపులు కొనసాగించాలని ఎమర్జెన్సీ ఫోన్ నంబర్లు 977 – 980 860 2881; 977 – 981 032 6134 వెల్లడించింది. అయితే గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాకు చెందిన 40మందికిపైగా భక్తులు తీర్థయాత్ర కోసం నేపాల్‌కు వెళ్లి అక్కడే చిక్కుకుపో యారని తాజా సమాచారం.
ప్రధాని మోదీ సమీక్ష
తాజా పరిణామాలపై భారత ప్రధాని మోదీ ఢిల్లీలో మంగళవారం సమీక్ష జరిపారు. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అత్యవసరంగా సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించింది. తర్వాత భేటీపై మోదీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘నేపాల్‌లో తాజా పరిణామాలు నన్నెంతో కలచివేశాయి. ఎందరో యువకులు బలయ్యారు. అక్కడ శాంతి నెలకొనడం తక్షణావసరం. నేపాలీలంతా సంయనంతో మెలగాలని కోరుకుంటున్నా’’అని మోదీ విజ్ఞప్తిచేశారు. నేపాల్‌లో జెన్‌జీ ఉద్యమాన్ని సుదన్ గురంగ్ అనే 36 ఏళ్ల వ్యక్తి నడుపుతున్నారు. యువత సారథ్యంలో నడిచే ‘హమి నేపాల్’సంస్థకు ఇతను అధ్యక్షునిగా సేవలందిస్తున్నారు.