మలేరియా వ్యాప్తిని నిరోధించే దోమలు

Scientists engineer mosquitoes that canot spread malaria - Sakshi

అభివృద్ధి చేసిన యూకే పరిశోధకులు  

లండన్‌: మలేరియా.. మానవాళికి పెనుముప్పుగా మారిన అతిపెద్ద వ్యాధి. దోమల నుంచి వ్యాపించే మలేరియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. వ్యాధి నివారణకు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. మలేరియా వ్యాప్తిని అరికట్టే దోమలను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇందుకోసం సాధారణ దోమల్లో జన్యుపరమైన మార్పులు చేశారు. మలేరియాకు కారణమయ్యే పారాసైట్లు జన్యుపరంగా మార్పు చేసిన ఈ దోమల్లో వేగంగా పెరగవని చెబుతున్నారు. మలేరియాను అరికట్టడంలో ఇదొక శక్తివంతమైన ఆయుధం అవుతుందని పేర్కొంటున్నారు. యూకేలోని ఇంపీరియల్‌ కాలేజీ లండన్‌తోపాటు బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌కు చెందిన ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డిసీజ్‌ మోడలింగ్‌’ పరిశోధకులు ఈ ఘనత సాధించారు.

ఈ వివరాలను సైన్స్‌ అడ్వాన్సెస్‌ జర్నల్‌లో ప్రచురించారు. మలేరియా సోకిన వ్యక్తిని కుట్టిన ఆడ దోమ మరో వ్యక్తిని కుడితే అతడికి కూడా వ్యాధి సోకుతుంది. అంటే దోమల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. మలేరియా పారాసైట్లు తొలుత దోమ ఆంత్రంలోకి చేరుకుంటాయి. అక్కడే ఇన్ఫెక్షన్‌ కలిగించే స్థాయికి ఎదుగుతాయి. అనంతరం లాలాజల గ్రంథుల్లోకి చేరుకుంటాయి. ఆంత్రంలో పారాసైట్లు ఎదగడానికి ఎక్కువ సమయం పట్టేలా చేశారు. పారాసైట్లు అభివృద్ధి చెంది, మనిషిని కుట్టే లోపే దోమల జీవితకాలం ముగుస్తుందని చెబుతున్నారు. ప్రపంచంలో సగం జనాభాకు మలేరియా రిస్క్‌ పొంచి ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 2021లో ప్రపంచవ్యాప్తంగా 24.10 కోట్ల మలేరియా కేసులు నమోదయ్యాయి. 6,27,000 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top