వీనస్‌.. ‘రష్యన్‌ ప్లానెట్‌’: రష్యా కీలక వ్యాఖ్యలు!

Russians Claim Venus As Their Planet  Alien Life Phosphine Discovered - Sakshi

మాస్కో: భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహమైన శుక్రుడి మీద జీవం ఉండేందుకు ఆస్కారం ఉన్నట్లు ఇటీవలి పరిశోధనల్లో వెల్లడైన విషయం తెలిసిందే. శుక్ర గ్రహం మీద ఉన్న దట్టమైన మేఘాల్లో ఫాస్ఫైన్‌ అణువులు ఉన్నట్లు బ్రిటన్‌లోని కార్డిఫ్‌ యూనివర్సిటీ పరిశోధకులు సోమవారం తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యా సంచలన ప్రకటన చేసింది. వీనస్‌ను ‘‘రష్యన్‌ ప్లానెట్‌’’ అని పేర్కొంటూ ఆ గ్రహంపై గుత్తాధిపత్యం ప్రకటించుకుంది.

ఈ మేరకు మాస్కోలో జరుగుతున్న ఇండస్ట్రీ ఎగ్జిబిషన్‌లో రష్యా  అంతరిక్ష సంస్థ చీఫ్‌ దిమిత్రి రొగోజిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘శుక్ర గ్రహం మీద అడుగుపెట్టిన మొట్టమొదటి, ఏకైక దేశం మాదే’’ అని పేర్కొన్నారు. 60, 70,80 దశకాల్లో శుక్రుడి మీద తమ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. ఆ గ్రహానికి సంబంధించి అనేకానేక విషయాలను తమ అంతరిక్షనౌకలు ఏనాడో సమాచారం సేకరించాయని, అక్కడి పరిస్థితులు చాలా సంక్లిష్టంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. (చదవండి: శుక్రగ్రహం మీద ఫాస్ఫైన్‌!)

ఇక తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలోనే రష్యా సొంతంగా వీనస్‌పై మరోసారి పరిశోధనలు చేసేందుకు ప్రణాళికలు చేస్తోందని ఆయన ప్రకటించారు. గతంలో అమెరికా సహాయంతో వెనెరా- డి మిషన్‌తో సంబంధం లేకుండా ప్రత్యేకంగా మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు రొగోజిన్‌ వెల్లడించారు.‘‘ఆన్‌- ప్లానెట్‌ స్టేషన్ల ద్వారా శుక్ర గ్రహ పరిస్థితుల మీద తరచుగా ప్రయోగాలు చేసిన చరిత్ర రష్యాకు ఉంది. సౌరకుటుంబంలో తొలిసారిగా ఇతర గ్రహం మీద విజయవంతంగా అడుగుపెట్టాం. 1970లో వెనెరా-7 ద్వారా కీలక ఘట్టం ఆవిష్కరింపజేశాం. వీనస్‌ మీది వాతావరణం, మట్టి, ఇతర మూలకాల మిశ్రమం తదితర అంశాల గురించి వివిధ దశల్లో ప్రయోగాలు చేశాం. 

అంతేకాదు శుక్ర గ్రహం మీద అత్యధికంగా 127 నిమిషాల పాటు యాక్టివ్‌గా ఉన్న స్సేప్‌క్రాఫ్ట్‌గా ది సోవియెట్‌ వెనెరా-13 పేరిట రికార్డు నేటికీ పదిలంగా ఉంది’’అంటూ శుక్ర గ్రహాన్ని రష్యా ప్లానెట్‌గా పేర్కొనడం వెనుక ఉన్న ఉద్దేశం గురించి వివరించారు. ఈ మేరకు ది మాస్కో టైమ్స్‌ కథనం వెలువరించింది. కాగా.. ఇక బ్రిటన్‌ శాస్త్రవేత్తల తాజా పరిశోధనల నేపథ్యంలో, ఫాస్ఫైన్ ఉన్నంత మాత్రాన శుక్రుడి మీద జీవం ఉందని చెప్పలేమని, ఒక గ్రహం మీద భాస్వరం సమృద్ధిగా ఉన్నప్పటికి.. జీవం మనుగడకు అనుకూలమైన వాతావరణం అక్కడ లేకపోవచ్చని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడిన విషయం తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top