అమెరికా ఎన్నికలు; బాంబు పేల్చిన మైక్రోసాఫ్ట్‌!

Russian, Chinese Hackers Targeting US 2020 Election: Microsoft - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా ఎన్నికలు ఇంకా నెలన్నర ఉండగానే హ్యాకర్ల బాంబు పేలింది. గత ఎన్నికల్లాగే ఈ ఎన్నికల్లోనూ విదేశీ హ్యాకర్లు తలదూర్చే ప్రమాదముందంటూ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ హెచ్చరించింది. ప్రధానంగా రష్యా, చైనా, ఇరాన్‌ల నుంచి ఎన్నికలకు ముప్పు పొంచి ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్‌ మళ్లీ గెలవాలని రష్యా కోరుకుంటే, కచ్చితంగా ట్రంప్‌ ఓడిపోవాలన్నది చైనా, ఇరాన్‌ ఆశ. 2016 తరహాలో ఈ సారి కూడా అమెరికా ఎన్నికల్లో విదేశీ హ్యాకర్లు రంగంలోకి దిగినట్టు ట్రంప్‌ ప్రభుత్వానికి మైక్రోసాఫ్ట్‌ హెచ్చరికలు పంపింది. రష్యా, చైనా, ఇరాన్‌ నుంచి హ్యాకర్ల ముప్పు వాటిల్లుతోందని, ప్రజల తీర్పును తారుమారు చేసే వ్యూహం పన్నుతున్నాయని, విదేశీ హ్యాకర్లపై తమకు కచ్చితమైన ఆధారాలున్నాయన్న మైక్రోసాఫ్ట్‌ తెలిపింది.

2016 ఎన్నికల్లో డెమొక్రాట్ల ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌ అనూహ్యంగా దారి తప్పింది. డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ సందేశాలు, వీడియో క్లిప్పులు, సోషల్ మీడియా మెసెజ్‌లు ఎంతగా ప్రయత్నించినా ఓటర్లకు చేరలేదన్న ఆరోపణలున్నాయి. దీని వెనక రష్యా హ్యాకర్ల హస్తం ఉందంటూ అప్పట్లో గగ్గోలు పెట్టారు డెమొక్రాట్లు. ఆ విషయం దర్యాప్తులో తేలకుండానే 2020 ఎన్నికలు వచ్చాయి. అధ్యక్ష పదవికి అభ్యర్థులు ఖరారై ప్రచారం ఊపందుకుంటున్న వేళ.. మైక్రోసాఫ్ట్‌ బాంబు పేల్చింది.

ఇప్పటికే విదేశీ హ్యాకర్లు రంగంలోకి దిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. డొనాల్డ్‌ ట్రంప్‌, బైడెన్‌ ప్రచారంపై సైబర్‌ రాడార్‌ పెట్టారని, 200 కంపెనీల సాయంతో రష్యా హ్యాకింగ్‌ చేస్తోన్నట్టు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. ఇప్పటికే రంగంలోకి రష్యా కంపెనీ స్ట్రోంటియం గ్రూప్‌ దిగిందని, గతంలో బ్రిటన్‌ ఎన్నికల్లోనూ చిచ్చుబెట్టినట్టు స్ట్రోంటియం గ్రూప్‌పై ఆరోపణలున్నాయని తెలిపింది. స్ట్రోంటియం గ్రూప్‌ రష్యా ఇంటలిజెన్స్‌ సర్వీస్‌కు దగ్గరి సంబంధాలున్నాయని మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది.

అమెరికాకు చిరకాల ప్రత్యర్థి అయిన రష్యా ఇప్పుడు మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చిచ్చు పెట్టబోతుందన్నది మైక్రోసాఫ్ట్ హెచ్చరిక. రష్యా ఇంటలిజెన్స్‌ సర్వీస్‌ జీఆర్‌యూ మిలిటరీ సర్వీసెస్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగే సంస్థ స్ట్రోంటియం గ్రూప్‌. సైబర్‌ దాడులకు స్ట్రోంటియం గ్రూప్‌ పెట్టింది పేరు. ఇప్పుడిదే గ్రూప్‌ అమెరికాలోనూ ప్రజాభిప్రాయాన్ని తప్పుబట్టించే పనిలో పడిందన్నది మైక్రోసాఫ్ట్‌ వెల్లడించిన అంశం. ఇప్పటివరకు రష్యా కంపెనీ చేసిన సైబర్‌ అటాక్‌లను అడ్డుకున్నామని, అయితే ఇప్పుడు చైనా, ఇరాన్‌లు జత కలిసాయని, ఈ గ్రూప్‌ ఆట కట్టించకపోతే ఫలితాలు తారుమారయ్యే అవకాశముందని మైక్రోసాఫ్ట్‌ హెచ్చరించింది. పార్టీలు, నాయకులు వాడుతున్న సోషల్‌ మీడియా యాప్‌లో చాలా లొసుగులున్నాయని, సరిగ్గా ఇక్కడే రష్యా, చైనా, ఇరాన్‌ సైబర్‌ అటాక్‌ చేస్తున్నాయని తెలిపింది. జో బైడెన్‌ క్యాంపెయిన్‌లో కీలకంగా ఉన్న కొందరి ఈమెయిల్‌ అకౌంట్లను ఇప్పటికే హ్యాక్‌ చేశారని, ట్రంప్‌ దగ్గరి మనుషుల్లోనూ కొందరి ఈమెయిల్‌ హ్యాక్‌ అయ్యాయని తెలిపింది.

అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాలైన రష్యా, చైనా, ఇరాన్‌ ఈ విషయంలో ఒకరికొకరు సహకారం అందించుకుంటున్నట్టు తెలిసింది. ఇప్పటికే అమెరికా ఎన్నికలపై చైనా డేగ కన్ను వేసినట్టు గుర్తించారు. హ్యాకింగ్‌లో సిద్ధహస్తులైన తన కంపెనీ జిర్కోనియంను చైనా రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. విద్యార్థి వీసాల రూపంలో అమెరికాలో ఉంటోన్న పలువురిని జిర్కోనియం రంగంలోకి దించినట్టు గుర్తించారు. హ్యాకింగ్‌ ఉప్పందగానే అమెరికా దాదాపు వెయ్యి మంది చైనా విద్యార్థుల వీసాలు  రద్దు చేసింది.

హ్యాకింగ్‌కు ప్రయత్నిస్తున్న దేశాలు.. ప్రధానంగా అమెరికా ప్రముఖ సంస్థల రికార్డులను టార్గెట్‌ చేసినట్టు గుర్తించారు. ఇరాన్‌ కంపెనీ పాస్పరస్‌ కూడా చైనా, రష్యాలకు దీటుగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఒక అడుగు ముందుకేసి ఏకంగా వైట్‌హౌజ్‌ అధికారులపై ఇరాన్‌ నిఘా పెట్టినట్టు తెలిసింది. మే, జూన్‌ నెలల్లో ఇరాన్‌ కంపెనీ పాస్పరస్‌ ప్రయత్నాలు చేసిందని, ఈ ప్రయత్నాలను పసిగట్టినట్టు గూగుల్‌ కంపెనీ వెల్లడించింది. (చదవండి: ఏనుగు లేదా గాడిద.. ఎవరిది పైచేయి?!)

రష్యా, చైనా, ఇరాన్‌.. మూడింటికి అమెరికా అంటే పీకలదాక కోపం ఉంది. ఇప్పుడు ఈ మూడు తమ కంపెనీలను రంగంలోకి దించాయి. చైనా కంపెనీ జిర్కోనియం ప్రముఖ సంస్థలను టార్గెట్‌ చేస్తే.. ఇరాన్‌ కంపెనీ పాస్పరస్‌ ఏకంగా వైట్‌ హౌజ్‌ అధికారుల ఖాతాలను తస్కరించినట్టు తెలిసింది. చైనా, ఇరాన్‌ చేసిన ప్రయత్నాలను తాము పసిగట్టినట్టు గూగుల్‌ కూడా వెల్లడించింది. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ ఆరోపణలను రష్యా, చైనా వేర్వేరుగా ఖండించాయి. అమెరికా ఎన్నికలతో తమకు సంబంధం లేదంటూ రష్యా, చైనా, ఇరాన్‌ చెబుతున్నా.. అన్ని వేళ్లు మాత్రం ఆ మూడు దేశాలపైనే చూపిస్తున్నాయి. అమెరికా హోంలాండ్‌ సెక్యూరిటీలో అత్యున్నత సైబర్‌ డిపార్ట్‌మెంట్‌ ఇప్పటికే వీటిపై దృష్టి పెట్టింది. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ కంపెనీలు ఇచ్చిన సమాచారాన్ని మరింత విశ్లేషించే పనిలో హోంలాండ్‌ అధికారులు పడ్డారు. మూడు దేశాలది అమెరికాపై కోపమే అయినా ఇందులో చిన్న ట్విస్ట్‌ ఉంది.

రష్యా మరోసారి ట్రంప్‌ గెలవాలని కోరుకుంటోండగా, చైనా మాత్రం ట్రంప్‌ ఎట్టి పరిస్థితుల్లో గెలవద్దంటోంది. చైనా తరహాలోనే ఇరాన్‌ ఆలోచిస్తుంది. తమపై సైనిక దాడి చేసినందుకు ట్రంప్‌కు బుద్ధి చెప్పాలన్నది ఇరాన్‌ లక్ష్యం. ఎవరి టార్గెట్‌ ఎలా ఉన్నా.. ఇప్పటికే విలువైన కొంత సమాచారం హ్యాకర్లకు చిక్కినట్టు ఇంటలిజెన్స్‌ అధికారులు భావిస్తున్నారు. అగ్రరాజ్యమని చెప్పుకునే తమకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంపై హోంలాండ్‌ అధికారులు గుర్రుగా ఉన్నారు. హ్యాకర్ల ఆట పూర్తి స్థాయిలో కట్టించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. (చదవండి: నిజంగా అమెరికాలో ఆ పరిస్థితి ఉందా?)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top