100 మందిపై స్పుత్నిక్‌–వీ ప్రయోగం

Russian Anti-COVID Vaccine Sputnik V To Be Tested On 100 Indian Volunteers - Sakshi

మాస్కో/న్యూఢిల్లీ: భారత్‌లోని 100 మంది వలంటీర్లపై, రష్యా కోవిడ్‌ టీకా స్పుత్నిక్‌–వీను ప్రయోగించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌కి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌(డీసీజీఐ) అనుమతిచ్చినట్లు రష్యా వార్త సంస్థ స్పుత్నిక్‌ వెల్లడించింది. ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేదీ నిర్ణయించాల్సి ఉంది. మూడో దశలోకి ప్రవేశించే ముందు, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేయాల్సి ఉంది. రష్యా అభివృద్ధి పరిచిన స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు భారత్‌లో వ్యాక్సిన్‌ పంపిణీకి, రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌)తో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

ఒప్పందంలో భాగంగా ప్రయోగాల అనంతరం 10 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను తయారుచేయడానికి రెడ్డీస్‌ ల్యాబ్‌కి అనుమతిచ్చినట్లు ఆర్‌డీఐఎఫ్‌ వెల్లడించింది. గత నెలలో ఆర్‌డీఐఎఫ్‌ భారత ప్రభుత్వంతోనూ, ఔషధ కంపెనీలతో స్థానికంగా స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ తయారీపై చర్చించింది. అలాగే స్పుత్నిక్‌–వీ భద్రత, దాని పనితీరుపై మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలను ‘ది లాన్సెట్‌’మెడికల్‌ జర్నల్‌ లో ప్రచురించారు. రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కి 100 మందిపై, మూడో దశలో 1,400 మంది వలంటీర్లపై ప్రయోగాలు జరుపుతారని అధికారులు వెల్లడించారు.  

తొలిగా 4 కేటగిరీల వారికి టీకా పంపిణీ
కరోనా మహమ్మారికి భారత్‌లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే ‘స్పెషల్‌ కోవిడ్‌ ఇమ్యూనైజేషన్‌ ప్రోగ్రాం’ కింద ప్రాధాన్య వర్గాలకు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. తొలి దశలో వ్యాక్సిన్ల పంపిణీ కోసం ప్రభుత్వం ప్రజలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరించింది. ఇందులో కోటి మంది డాక్టర్లు, నర్సులు, ఎంబీబీఎస్‌ విద్యార్థులు, ఆశా వర్కర్లు ఉన్నారు. అలాగే 2 కోట్ల మంది మున్సిపల్‌  కార్మికులు, పోలీసులు, సైనిక సిబ్బంది.. 26 కోట్ల మంది 50 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. 50 ఏళ్లలోపు వయసుండి ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికీ మొదటి దశలోనే టీకా ఇచ్చే అవకాశం ఉంది.  

77 లక్షలు దాటిన కేసులు
దేశంలో గత 24 గంటల్లో  54,366  కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,61,312కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 690 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,17,306 కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 69,48,497 కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,95,509 గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్‌ కేసులు 8.96 శాతం ఉన్నాయి.  రికవరీ రేటు  89.53  శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.51గా నమోదైంది.      

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top