Russia-Ukraine war: రణరంగంలో రసాయనాయుధాలు!.. ప్రయోగిస్తే పెను విధ్వంసమే

Russia-Ukraine war: Nato will respond if Russia uses chemical weapons, warns Biden - Sakshi

రష్యాపై యూఎస్‌ అనుమానం

యుద్ధం మొదలెట్టి రోజులు గడుస్తున్నా ఆశించిన ఫలితం రాకపోతే యుద్ధాన్ని ఆరంభించిన పక్షానికి చికాకు, అసహనం పెరుగుతాయి. దీంతో మరింత భయంకరమైన ఆయుధ ప్రయోగానికి దిగే ప్రమాదం ఉంది. ఉక్రెయిన్‌పై దాడిలో విజయం కనుచూపుమేరలో కానరాకపోవడంతో రష్యా రసాయనాయుధాల ప్రయోగానికి దిగే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

 ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలై నెల దాటింది. ఇంతవరకు చెప్పుకోదగ్గ విజయం రష్యాకు దక్కినట్లు కనిపించడం లేదు. దీంతో యుద్ధాన్ని ఎలా ముగించాలో అర్థం కాని పుతిన్‌ భయంకర జనహనన ఆయుధాలను ప్రయోగించవచ్చనే భయాలున్నాయి. రష్యా విజయం కోసం రసాయన ఆయుధాలు ప్రయోగించే అవకాశాలు అధికమని యూఎస్‌ అనుమానిస్తోంది. ఇందుకోసం ముందుగా ఉక్రెయిన్‌లో జీవ, రసాయన ఆయుధాలున్నాయని రష్యా ప్రచారం చేస్తోందని, రాబోయే రోజుల్లో ఉక్రెయిన్‌ను నిలవరించడానికనే సాకుతో రష్యా రసాయనాయుధాలు ప్రయోగించవచ్చని అమెరికా భావిస్తోంది.

ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేలా ఈ నెల 21న సుమీ నగరంలోని ఒక రసాయన ప్లాంట్‌ను రష్యా పేల్చివేసింది. దీంతో అక్కడి వాతావరణంలోకి భారీగా అమ్మోనియా విడుదలై స్థానికులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చింది. గతంలో పుతిన్‌ రసాయన ఆయుధాల ప్రయోగించిన దాఖలాలున్నాయని, అందువల్ల ఈ విషయంలో అంతా అప్రమత్తంగా ఉండాలని బైడెన్‌ హెచ్చరించారు. ఉక్రెయిన్‌ తన సొంత పౌరులపై రసాయన దాడికి సన్నాహాలు చేస్తోందని అటుపక్క రష్యా విమర్శిస్తోంది. తమపై రసాయన ఆయుధ ప్రయోగ నేరారోపణ చేయడానికి ఉక్రెయిన్‌ ఈ దారుణానికి తలపడనుందని రష్యా రక్షణ మంత్రి ఆరోపించారు.  

రష్యా రూటే సెపరేటు
కెమికల్‌ ఆయుధాల ప్రయోగంలో రష్యాకుక ఘన చరిత్ర ఉంది. చాలా సంవత్సరాలుగా పలువురిని రష్యా ఈ ఆయుధాలు ఉపయోగించి పొట్టన పెట్టుకుందన్న ఆరోపణలున్నాయి. తాజాగా సిరియాలో పౌరులపై రసాయనాయుధాలను అధ్యక్షుడు బషర్‌ రష్యా సహకారంతో ప్రయోగించారని అమెరికా ఆరోపించింది. దీనిపై విచారణకు రష్యా అడ్డుపడుతోందని విమర్శించింది. అలాగే రష్యా ఏజెంట్‌ సెర్గీ స్కిరిపల్, ఆయన కుమార్తె యూలియాను లండన్‌లో ఈ ఆయుధాలతోనే రష్యా బలి తీసుకుందని విమర్శలున్నాయి.

రష్యా మిలటరీ ఇంటెలిజెన్స్‌ సంస్థ  గ్రు కు చెందిన ఇద్దరికి ఈ ఘటనతో సంబంధం ఉందని బ్రిటన్‌ ఆరోపించింది. 2020లో పుతిన్‌ చిరకాల విమర్శకుడు అలెక్సి నవల్నీపై విష ప్రయోగం జరిగింది. స్వదేశంలో ఒక విమాన ప్రయాణంలో ఆయన హఠాత్తుగా అస్వస్థుడయ్యాడు. అనంతరం ఆయన కోమాలోకి జారుకున్నారు. నరాల బలహీనతను కలిగించే కెమికల్‌ ఆయనపై ప్రయోగించినట్లు జర్మనీలో ఆయనపై జరిపిన పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలోనే రష్యా త్వరలో ఉక్రెయిన్‌లో కెమికల్‌ వెపన్స్‌ వాడబోతుందని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏం జరగవచ్చు?
నిజానికి రసాయనాయుధాలున్నాయన్న సాకుతో ఇతర దేశాలపై దాడులు చేసిన సంస్కృతి అమెరికాకే ఉంది. ఇరాక్‌ విషయంలో అమెరికా చేసిన ఘాతుకాన్ని ప్రపంచం మరిచిపోలేదు. నీవు నేర్పిన విద్యయే.. అన్నట్లు ప్రస్తుతం పుతిన్‌ అమెరికా చూపిన బాటలో పయనించే యోచనలో ఉన్నారు. రష్యా ఇలాంటి ఆయుధాలను వాడితే తాము తీవ్రంగా స్పందిస్తామని అమెరికా హెచ్చరిస్తోంది. నాటో సైతం ఇదే తరహా హెచ్చరిక చేసింది. 

రష్యా మాట వినకుండా వీటిని ప్రయోగిస్తే అప్పుడు తమ కూటమి నేరుగా యుద్ధంలో పాల్గొనాల్సివస్తుందని హెచ్చరించింది. ఒకపక్క దాడి మొదలై ఇన్ని రోజులైనా తగిన ఫలితం రాకపోవడం రష్యాను చికాకు పెడుతోంది. మరోవైపు రష్యా డిమాండ్లను ఉక్రెయిన్‌ అంగీకరించడంలేదు. ఇప్పటికే అంతర్జాతీయ వ్యతిరేకతను మూటకట్టుకున్న పుతిన్‌ రసాయనాయుధాల్లాంటి తొందరపాటు చర్యకు దిగకపోవచ్చ ని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ యుద్ధం ఇలాగే మరిన్ని రోజులు కొనసాగితే పుతిన్‌ మనసు మారే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. 

అసలేంటీ ఆయుధాలు?
నిజానికి ప్రతి ఆయుధంలో కెమికల్స్‌ ఉంటాయి. ఉదాహరణకు తుపాకీ బుల్లెట్లలో ఉండే గన్‌ పౌడర్‌ ఒక రసాయన పదార్ధమే! అయితే జీవులను ఒక్కమారుగా చంపగలిగే ప్రమాదకరమైన వాయువులు లేదా ద్రావకాల మిశ్రమాన్ని అచ్చంగా రసాయనాయుధమంటారు. ఒపీసీడబ్ల్యూ (ఆర్గనైజేషన్‌ ఫర్‌ ద ప్రొహిబిషన్‌ ఆఫ్‌ కెమికల్‌ వెపన్స్‌) ప్రకారం ప్రమాదకర రసాయనాలను కలిగిఉండేలా డిజైన్‌ చేసిన ఆయుధాలు, వస్తువులను రసాయనాయుధాలంటారు.

ఉదాహరణకు అమ్మోనియా అధిక మోతాదులో విడుదలైతే అక్కడున్న మనుషులకు అంధత్వం, ఊపిరితిత్తుల విధ్వంసంతో పాటు మరణం కూడా సంభవించవచ్చు. తొలి ప్రపంచ యుద్ధ సమయంలోనే రసాయనాయుధాల వాడకం జరిగింది. ఆ యుద్ధంలో క్లోరిన్, ఫాస్జీన్, మస్టర్డ్‌ గ్యాస్‌ను ఇరుపక్షాలు వినియోగించాయి. కేవలం వీటివల్ల అప్పట్లో లక్ష మరణాలు సంభవించాయి. కాలం గడిచే కొద్దీ అత్యంత ప్రమాదకరమైన రసాయనాయుధాల తయారీ పెరిగింది. కోల్డ్‌వార్‌ సమయంలో యూ ఎస్, రష్యాలు ఇబ్బడిముబ్బడిగా వీటిని రూ పొందించాయి. తర్వాత కాలంలో పలు దేశాలు రహస్యంగా వీటి తయారీ, నిల్వ చేపట్టాయి.  

రసాయనాలు– రకాలు
రసాయనాయుధాలను అవి కలిగించే ప్రభావాన్ని బట్టి పలు రకాలుగా వర్గీకరించారు.  
1. చర్మంపై ప్రభావం చూపేవి (బ్లిస్టర్‌ ఏజెంట్స్‌): ఫాస్జీన్‌ ఆక్సైమ్, లెవిసైట్, మస్టర్డ్‌ గ్యాస్‌.
2. నరాలపై ప్రభావం చూపేవి (నెర్వ్‌ ఏజెంట్స్‌): టబున్, సరిన్, సొమన్, సైక్లో సరిన్‌.
3. రక్తంపై ప్రభావం చూపేవి (బ్లడ్‌ ఏజెంట్స్‌): సైనోజన్‌ క్లోరైడ్, హైడ్రోజన్‌ సైనేడ్‌.
4. శ్వాసపై ప్రభావం చూపేవి (చోకింగ్‌ ఏజెంట్స్‌): క్లోరోపిక్రిన్, క్లోరిన్, డైఫాస్జిన్‌. 
 

– నేషనల్‌ డెస్క్, సాక్షి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top