బర్డ్‌‌ ఫ్లూ కొత్త స్ట్రెయిన్‌‌: రష్యాలో తొలి కేసు!

Russia Reports Worlds First Case Of Transmission Of Bird Flu To Humans - Sakshi

మాస్కో: కరోనా వైరస్‌తో ఇప్పటికే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. మరోవైపు బ్రిటన్‌ను కరోనా స్ట్రెయిన్‌ గజగజలాడిస్తోంది. తాజాగా రష్యాలో బయటపడిన ఓ కొత్త రకం వైరస్‌ ఆందోళన కలిగిస్తోంది. రష్యాలోని ఓ పౌల్ట్రీ కోళ్లలో కొత్త రకం H5N8 స్ట్రెయిన్‌ వైరస్ బయటపడింది. పౌల్ట్రీలో పనిచేసే ఏడుగురిలో ఈ కొత్త వైరస్‌ను గుర్తించారు. కోళ్ల నుంచి మనుషులకు వైరస్‌ సోకిన తొలి కేసుగా ఈ ఘటన నిలిచిందని ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారి అన్నాపొపొవా వెల్లడించారు. దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించామని తెలిపారు. కోళ్లను ప్రత్యక్షంగా తాకడం ద్వారా, అపరిశుభ్ర వాతావరణంలో ఉండటం వల్ల ఈ వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని అన్నారు.

ఇది పక్షులకు కూడా సోకే ప్రమాదం ఉందని, వలస పక్షుల కారణంగా వేగంగా వ్యాపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే H5N8 వైరస్‌ మనుషుల్లో అంత ప్రభావం చూపడం లేదని ఆయన పేర్కొన్నారు. ఫ్రెంచ్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ (సీఎన్‌ఆర్‌ఎస్‌) పరిశోధకుడు ఫ్రాంకోయిస్‌ రెనాడన్‌ మాట్లాడుతూ.. ఈ కొత్త స్ట్రెయిన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటికే దీనిపై తాము ప్రయోగాలు మొదలుపెట్టామని తెలిపారు. కరోనా ప్రపంచానికి వేగంగా స్పందించడం నేర్పిందని, కొత్త వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

మరోవైపు రష్యాకు చెందిన వెక్టర్‌ స్టేట్‌ వైరాలజీ అండ్‌ బయో టెక్నాలజీ సెంటర్‌ కరోనా వైరస్‌కు టీకా అభివృద్ది చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త బర్డ్‌ ఫ్లూ స్ట్రెయిన్‌కు తాము వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని వెక్టర్‌ చీఫ్‌ రినాట్‌ మక్యుటోప్‌ తెలిపారు.
చదవండి: ముసలి వేషంతో కరోనా టీకా, కానీ..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top