రోబో ఎంత పనిచేసిందంటే.. వీడియో వైరల్‌ | Robot Kicks Young Boy In Stomach During Show In China | Sakshi
Sakshi News home page

రోబో ఎంత పనిచేసిందంటే.. వీడియో వైరల్‌

Jun 5 2026 12:40 PM | Updated on Jun 5 2026 5:13 PM

Robot Kicks Young Boy In Stomach During Show In China

చైనాలోని ఓ రోబో కలకలం రేపింది. షింజియాగ్‌లోని ఉర్మికి బొటానికల్‌ గార్డెన్‌లో బాలుడిపై రోబో దాడి చేసింది. బాలుడి పొట్టలో తన్నడంతో ఆ బాలుడు బాధతో విలవిల్లాడిపోయాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన నేపథ్యంలో రోబోలపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ బాలుడు తన కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి బొటానికల్ గార్డెన్‌కు వెళ్లాడు. అక్కడ హ్యూమనాయిడ్ రోబో ప్రదర్శనను చూడటానికి మిగతా ప్రేక్షకులతో కలిసి నిలబడటంతో అంతా బాగానే సాగుతోంది. కానీ అంతలోనే అనూహ్య మలుపు చోటుచేసుకుంది.

ఆ రోబో హఠాత్తుగా ఆ చిన్న బాలుడి పొట్టలో తన్నింది. ఈ వీడియో ఈ క్షణాల్లో వైరల్ కావడంతో.. రోబోల చుట్టూ ఉండాల్సిన భద్రతా ప్రమాణాలపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆ వీడియో క్లిప్‌లో కనిపించినట్లుగా.. ఆఫ్రో-స్టైల్ విగ్ ధరించిన ఆ హ్యూమనాయిడ్ రోబో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన చేస్తోంది. పిల్లలు, పెద్దలు ఆ వినూత్న ప్రదర్శనను ఆసక్తిగా చూస్తూ.. రికార్డ్ చేస్తున్నారు. ఒకానొక సమయంలో ఆ రోబో ఫైటింగ్ స్టాన్స్‌లో ముందుకు అడుగు వేసి చుట్టూ తిరుగుతూ రౌండ్‌హౌస్ కిక్ ఇచ్చింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య కాకపోయినప్పటికీ.. ఆ ప్రదర్శనను ఎంతో ఆసక్తిగా చూస్తున్న పింక్ కలర్ టీ-షర్ట్, జీన్స్ ధరించిన ఓ బాలుడి పొట్టకు నేరుగా తగిలింది.

Viral: బాలుడి కడుపులో తన్నిన రోబో కుప్పకూలిన బుడ్డాడు

ఆ బాలుడు నొప్పితో విలవిలలాడుతుండగా.. పక్కనే ఉన్న మరో బాలుడు అతడిని రోబోకు దూరంగా వెనక్కి లాగాడు. అక్కడున్న ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే, ఆ బాలుడికి తీవ్రమైన గాయాలేమీ కాలేదని తర్వాత ఓ వార్తా సంస్థ తెలిపింది. యంత్రం తప్పు చేసినప్పుడు బాధ్యత ఎవరిది? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రోబో ఆ బాలుడిని తన్నినా.. జనాలు ఇంకా ఆ రోబో వైపే చూస్తున్నారా? బాలుడి వైపు దృష్టి సారించి.. అతడు బాగున్నాడా? లేదా? అని చూసే మానవత్వం మనలో ఎటుపోయింది? ఓ నెటిజన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

"ఇది 'టెర్మినేటర్' సినిమా కాదు.. ఇక్కడ యంత్రాలు కావాలని హింసను ఎంచుకోవడం లేదు. అసలైన ప్రమాదం ఎక్కడ ఉందంటే.. హార్డ్‌వేర్ డెవలపర్లు భద్రతా ప్రమాణాలను పక్కనబెట్టి.. బహిరంగ కార్యక్రమాలలో యంత్రాలను అమాయకపు ఆటబొమ్మల్లా వదిలేస్తున్నారంటూ మరొకరు కామెంట్‌ చేశారు. ఇది కేవలం ఒక ప్రమాదంగానే భావిస్తున్నా.. ఆ రోబో కావాలని ఆ చిన్నారిని తన్నలేదు. అది మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శిస్తున్నప్పుడు ఆ పిల్లాడు దాని దారికి అడ్డంగా వచ్చాడు.. అందుకే  ఈ ఘటన జరిగిందని మరొకరు వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement