శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణం

కొలంబో: కల్లోల శ్రీలంకకు కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే(73) బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు గోటబయా రాజపక్స దగ్గరుండి మరీ విక్రమసింఘే లంక ప్రధానిగా ప్రమాణం చేయించారు. గురువారం సాయంత్రం అధ్యక్ష భవనంలో ఈ ప్రమాణోత్సవం జరిగింది. ఇదిలా ఉంటే లంకకు ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ఎంపిక కావడం కొత్తేం కాదు. గతంలో దఫాలుగా ఆయన ప్రధాని బాధ్యతలు చేపట్టారు.
ప్రస్తుతం శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక, రాజకీయ సంక్షోభం వీలైనంత త్వరగా సమసిపోవాలంటే అనుభవజ్ఞుడైన విక్రమసింఘే లాంటి వాళ్లు అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓవైపు హింస తీవ్రరూపు దాల్చుతుండడం ఆందోళన కలిగిస్తున్నా, మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘే వంటి అనుభవశాలి, వివాదరహితుడు మళ్లీ ప్రధాని పీఠం ఎక్కనున్నారన్న వార్తలు.. అక్కడి పౌరుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.
అంతకు ముందు విక్రమసింఘే శ్రీలంక కొత్త ప్రధానిగా బాధ్యతలు అందుకుంటున్నారన్న విషయాన్ని యునైటెడ్ నేషనల్ పార్టీకి చెందిన వజిర అబేవర్ధనే అనే అధికారి వెల్లడించారు. మరోవైపు అనేకమంది పార్లమెంటు సభ్యులు కొత్త ప్రధానిగా విక్రమసింఘేనే రావాలని కోరుకుంటున్నారని అబేవర్ధనే వివరించారు. యునైటెడ్ నేషనల్ పార్టీకి విక్రమసింఘేనే అధినేత. ఈయన ప్రధాని కావడంతో మాజీ ప్రధాని మహింద రాజపక్సకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు కొంతైనా తగ్గుముఖం పట్టొచ్చని అధ్యక్షుడు గోటబయా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.