పుతిన్‌ ప్రకటనతో రష్యాలో అల్లకల్లోలం.. భయాందోళనతో దేశం బయటకు!

Putin Ukraine Threat Effect: One Way Flights Out Of Russia Viral - Sakshi

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటనతో ప్రపంచమంతా అల్లకల్లోలం చెలరేగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. దాదాపు అంతటి స్థాయిలో ‘మొబైలైజేషన్‌’ కోసం పుతిన్‌ పిలుపు ఇవ్వడమే ఇందుకు కారణం. అంటే.. బలగాలను రంగంలోకి దించి యుద్ధ పరిస్థితులకు సన్నద్ధం కావడం అన్నమాట. ఈ నేపథ్యంలో.. 

మార్షల్‌ లా విధిస్తారనే భయాందోళన రష్యా అంతట నెలకొంది. ముఖ్యంగా యుద్ధంలో పాల్గొనే వయస్కున్నవాళ్లంతా.. రష్యాను వీడుతున్నారు. ఈ క్రమంలో.. రష్యా నుంచి విమానాలు బయటకు వస్తున్న దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. అవియాసేల్స్‌ అనే వెబ్‌సైట్‌ గూగుల్‌లో ట్రెండ్‌ కావడం, అది రష్యాలో విమాన టికెట్లు అమ్మే సైట్‌ కావడంతో అక్కడి పరిస్థితిని తెలియజేస్తోందని రాయిటర్స్‌ ఒక కథనం ప్రచురించింది. 

మరోవైపు ఫైట్‌రాడార్‌24 సైతం మాస్కో, సెయింట్‌పీటర్‌బర్గ్‌ నుంచి దేశం విడిచి వెళ్తున్న విమానాలకు సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను ట్విటర్‌లో విడుదల చేసింది. ఎయిర్‌ట్రాఫిక్‌ సంబంధిత దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు.. రద్దీ నేపథ్యంలో టికెట్ల ధరలు సైతం ఆకాశాన్ని అంటినట్లు తెలుస్తోంది. ఈ వారం మొత్తం టికెట్లు ఇప్పటికే బుక్‌ అయిపోయినట్లు ట్రావెల్‌ ఏజెన్సీలకు సంబంధించిన గణాంకాలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌ స్పెషల్‌ మిలిటరీ చర్యల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్‌ నుంచి రష్యాకు విమాన రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 

ఇక బుధవారం ఏకంగా 3 లక్షల రిజర్వు దళాలను తక్షణం యుద్ధ రంగానికి తరలించాలని రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు సమగ్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఎదురైనప్పుడు.. రష్యాను, రష్యా ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుందని, ఇదేం దాష్టికం కాదని పుతిన్‌ స్వయంగా ప్రకటించారు కూడా.

మళ్లీ పరిస్థితులు మొదటికే వస్తే.. తమ పరిస్థితి కుదేలు అవుతుందని రష్యా ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే.. ఉక్రెయిన్‌ దురాక్రమణ ఆంక్షల ప్రభావంతో విదేశీ కంపెనీలు తరలిపోగా.. నిరుద్యోగ శాతం పెరిగింది అక్కడ. మరోవైపు ధనికులపై కూడా పన్ను భారం అధికంగా పడుతోంది. అందుకే ముందుగానే దేశం వీడిపోవాలని భావిస్తున్నారు. మరోవైపు ఆంక్షల నడుమ నలిగిపోతున్న రష్యాపై యూరోపియన్‌ యూనియన్‌ మళ్లీ కొత్తగా ఆంక్షలు విధించాలని భావిస్తోంది. ఈ తరుణంలో వెనక్కి తగ్గకుండా కవ్వింపు దిశగా నిర్ణయాలు తీసుకుంటున్న పుతిన్‌ తీరుపై సొంద దేశ ప్రజలే మండిపడుతున్నారు.

ఇదీ చదవండి: శాశ్వత సభ్యదేశంగా ‘భారత్‌’కు లైన్‌క్లియర్‌!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top