తగ్గేదేలే.. పుతిన్‌ సంచలన నిర్ణయం

Putin Appointed New General To Direct War On Ukraine - Sakshi

మాస్కో: ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌లో 40 రోజులకుపైగా జరుగుతున్న యుద్దంలో రష్యా తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా ఇరువర్గాలు తమ సైనిక బలగాలను చాలా వ‌ర‌కు కోల్పోయిన‌ట్లు తెలుస్తోంది. వేల సంఖ్యలో సామాన్య పౌరులపై పాటుగా సైనికులు కూడా మృత్యువాతపడ్డారు. 

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌ను స్వాధీనం చేసుకోవడంలో పుతిన్‌ సైన్యం విఫలమైంది. ఈ క్రమంలో పుతిన్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. యుద్ధానికి నాయకత్వాన్ని మారుస్తూ.. రష్యా సదరన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ అలెగ్జాండర్ ద్వోర్నికోవ్‌ను నూతన ఆర్మీ జనరల్‌గా నియమించారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో విజయమే టార్గెట్‌గా అలెగ్జాండర్ ద్వోర్నికోవ్‌ను పుతిన్ నియమించినట్లు చర్చ జరుగుతోంది. మరోవైపు.. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై సోవియెట్ యూనియన్ విజయానికి గుర్తుగా మే 9న రష్యాలో విజయ దినోత్సవాలను జరుపుకుంటారు. దీంతో ఆ తేదీలోగా ఉక్రెయిన్‌పై విజయం సాధించాలనే లక్ష్యంతోనే పుతిన్‌ వ్యూహాలు మారుస్తున్నట్టు తెలుస్తోంది. 

కాగా, అంతకు ముందు యుద్ధం కారణంగా భారీ స్థాయిలో రష్యన్‌ బలగాలను కోల్పోయామ‌ని, జరిగిన ఘటన చాలా విషాద‌క‌ర‌మ‌ని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు. ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే.. యుద్ధ ప్రారంభంలో ఇంత నష్టం జరుగుతుందని ఊహించనట్లు తెలిపారు. అయితే, తాజాగా యుద్ధంపై ఉక్రెయిన్‌ స్థానిక మీడియా స్పందిస్తూ.. 13 రష్యన్ ఏరియల్ టార్గెట్స్‌ను ధ్వంసం చేసినట్లు శనివారం తెలిపింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top