అమెరికాలో కాల్పులు.. తొమ్మిది మంది మృతి | 9 killed including pregnant woman, 2 children in Pennsylvania | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పులు.. తొమ్మిది మంది మృతి

Oct 10 2026 7:13 PM | Updated on Oct 10 2026 7:28 PM

9 killed including pregnant woman, 2 children in Pennsylvania

వాషింగ్టన్‌ డీసీ: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఎరీ నగరంలో నిన్న (శుక్రవారం) సాయంత్రం ఓ ఇంట్లోకి చొరబడిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, ఓ గర్భిణీ తో పాటు  తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఆ నిందితుడు  తనకు తానే తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వివరాలను అక్కడి పోలీసులు వెల్లడించారు.

నిన్న అక్టోబర్ 9వ తేదీ శుక్రవారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల సమయంలో ఎరీ నగరంలోని పెర్రీ స్ట్రీట్‌లో 700వ బ్లాక్‌ పరిధిలో ఉన్న ఓ నివాసంలో కాల్పులు జరిగినట్లు అత్యవసర ఫోన్‌ కాల్స్‌ రావడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాల్పులు జరిగిన ఇంటి బయట ఇద్దరు మహిళల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అనంతరం ఆ పరిసరాల్లో మరికొన్ని మృతదేహాలు కనిపించాయి. 

తొలుత ఆ ఇద్దరు మహిళలపై కాల్పులు జరిపిన నిందితుడు అనంతరం ఇంట్లోకి ప్రవేశించి, అక్కడ ఉన్న పలువురిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు అధికారులు భావిస్తున్నారు. అనంతరం నిందితుడు ఒక రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు.

దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. నిందితుడు ఇంట్లోనే ఉండటంతో పోలీసులు అక్కడ మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు నిందితుడు తనకు తానే తుపాకీతో కాల్చుకుని మరణించినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు, ఈ కాల్పులకు పాల్పడిన నిందితుడు ఎవరు? బాధితులతో అతడికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ ఘాతుకానికి పాల్పడటానికి గల కారణాలేంటి? అనే అంశాలపై పోలీసులు ఇంకా స్పష్టతకు రాలేదు. కాల్పుల వెనుక ఉద్దేశాన్ని ఇప్పటివరకు గుర్తించలేదని అధికారులు వెల్లడించారు. నిందితుడికి, మృతులకు మధ్య ఉన్న సంబంధాలపైనా స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఇదీ చదవండి: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement