భారత్, యూఏఈ మధ్య ఏడు కీలక ఒప్పందాలు
పెట్రోలియం, ఎల్‌ఎన్‌జీ, ఎల్పీజీ నిల్వల పెంపునకు యూఏఈ సహకారం
భారత్‌కు ఎల్పీజీ దీర్ఘకాలిక సరఫరాకు ముందుకొచ్చిన అరబ్ ఎమిరేట్స్
యూఏఈ అధ్యక్షుడు అల్–నహ్యాన్‌తో మోదీ భేటీ
వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయం
పశ్చిమాసియాలో శాంతి సాధనకు సహకరిస్తామన్న ప్రధానమంత్రి
అబూదాబీ: పశ్చిమాసియాలో శాంతి సాధనకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన శుక్రవారం అబూదాబీలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్‌తో సమావేశమయ్యారు. భారత్–యూఏఈ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. భారత్‌కు ఇంధన భద్రత కల్పించడంతోపాటు రక్షణ, సాంకేతిక రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా కీలక ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి.
భారత్‌లో 5 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ ముందుకొచ్చిందని మోదీ వెల్లడించారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మొదట యూఏఈలో పర్యటించారు. దాదాపు రెండున్నర గంటలపాటు అబూదాబీలో ఉన్నారు. యూఏఈ అధ్యక్షుడితో జరిగిన భేటీలో మాట్లాడుతూ.. యూఏఈపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అరబ్ ఎమిరేట్స్‌ను లక్ష్యంగా చేసుకోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టంచేశారు. ప్రస్తుత పరిస్థితిని యూఏఈ సంయమనంతో ఎదుర్కొన్న తీరు నిజంగా ప్రశంసనీయమని పేర్కొన్నారు.
సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపు
పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మోదీ గుర్తుచేశారు. సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొనాలని కోరుకుంటున్నామని, అందుకోసం తమ వంతు సహకారం కచ్చితంగా అందిస్తామని తేల్చిచెప్పారు. వివాదాలు, ఘర్షణలను చర్చలు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలన్నదే భారత్ విధానమని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఏడు రంగాల్లో వ్యూహాత్మక సహకార ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
యూఏఈ పర్యటనలో భాగంగా ఇంధనం, రక్షణ, మౌలిక సదుపాయాలు, షిప్పింగ్, అధునాతన సాంకేతికత వంటి రంగాల్లో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయని మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇది భారత్–యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపునిచ్చిందని తెలిపారు. భారత్‌లో భారీగా పెట్టుబడులకు యూఏఈ సిద్ధం కావడం రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని వివరించారు. యూఏఈలో సంక్షిప్తమైన, అత్యంత ఫలవంతమైన పర్యటన జరిగిందన్నారు.
భారత్–యూఏఈ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై తన సోదరుడు అల్–నహ్యాన్‌తో చర్చించానని పేర్కొన్నారు. ఈ పర్యటన ఫలితాలు ఇరుదేశాల స్నేహాన్ని మరింత బలోపేతం చేసి, అభివృద్ధి శ్రేయస్సుకు దోహదపడతాయని విశ్వసిస్తున్నట్లు ఉద్ఘాటించారు. అంతకుముందు అబూదాబీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మోదీకి అల్–నహ్యాన్ స్వయంగా స్వాగతం పలికారు. మోదీ పర్యటనకు యూఏఈ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది.
ఓడల మరమ్మతుల్లో నైపుణ్యాభివృద్ధి
భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను పరిరక్షించే బాధ్యత కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజరŠవ్స్ లిమిటెడ్ వ్యూహాత్మక సహకారమే లక్ష్యంగా అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల భారత్‌కు ఇంధన భద్రత చేకూరుతుంది. భారతదేశ పెట్రోలియం నిల్వలను పెంపొందించడంతోపాటు ఎల్‌ఎన్‌జీ, ఎల్పీజీ నిల్వలను బలోపేతం చేయడానికి అబూదాబీ సంస్థ సహకరిస్తుంది.
ఇండియాకు ఎల్పీజీ దీర్ఘకాలిక సరఫరా, ఆర్థిక స్థిరత్వం, ఇంధన భాగస్వామ్యం లక్ష్యంగా ఎల్పీజీ రంగంలో వ్యూహాత్మక సహకార ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రక్షణ పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేయడం, నూతనఆవిష్కరణలను ప్రోత్సహించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం, జాతీయ, ప్రాంతీయ భద్రతను పటిష్టం చేయడం లక్ష్యంగా వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌పైనా సంతకాలు చేశారు.
గుజరాత్‌లో ఓడ మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి, ఓడరేవులు, తీరప్రాంత మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి మరో ఒప్పందం కుదిరింది. ఓడల మరమ్మతుల్లో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఇంకో ఒప్పందం కుదుర్చుకున్నారు. భారత్‌లో ఏఐ పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లడమే ధ్యేయంగా ఒక సూపర్ కంప్యూటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి ఆరో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇండియాలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సంబంధించినది ఏడో ఒప్పందం.
మోదీ విమానానికి ఎస్కార్ట్‌గా యూఏఈ యుద్ధ విమానం
ప్రధాని మోదీ పట్ల యూఏఈ ప్రభుత్వం తన గౌరవాన్ని చాటుకుంది. మోదీ ప్రయాణిస్తున్న విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత యూఏఈకి చెందిన ఎఫ్–16 యుద్ధ విమానం ఎయిర్‌పోర్టు దాకా ఎస్కార్ట్‌గా వచ్చింది. ఇది భారతీయులందరికీ దక్కిన గౌరవమని మోదీ యూఏఈ అధ్యక్షుడితో చెప్పారు. ఎయిర్‌పోర్టులో తనకు స్వయంగా స్వాగతం పలికిన అల్–నహ్యాన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.


