breaking news
Peace and Humanity
-
భారత్‌కు ఇంధన భద్రత
అబూదాబీ: పశ్చిమాసియాలో శాంతి సాధనకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయన శుక్రవారం అబూదాబీలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్తో సమావేశమయ్యారు. భారత్–యూఏఈ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. భారత్‌కు ఇంధన భద్రత కల్పించడంతోపాటు రక్షణ, సాంకేతిక రంగాల్లో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా కీలక ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. భారత్‌లో 5 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ ముందుకొచ్చిందని మోదీ వెల్లడించారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మొదట యూఏఈలో పర్యటించారు. దాదాపు రెండున్నర గంటలపాటు అబూదాబీలో ఉన్నారు. యూఏఈ అధ్యక్షుడితో జరిగిన భేటీలో మాట్లాడుతూ.. యూఏఈపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అరబ్ ఎమిరేట్స్‌ను లక్ష్యంగా చేసుకోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టంచేశారు. ప్రస్తుత పరిస్థితిని యూఏఈ సంయమనంతో ఎదుర్కొన్న తీరు నిజంగా ప్రశంసనీయమని పేర్కొన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపు పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మోదీ గుర్తుచేశారు. సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొనాలని కోరుకుంటున్నామని, అందుకోసం తమ వంతు సహకారం కచ్చితంగా అందిస్తామని తేల్చిచెప్పారు. వివాదాలు, ఘర్షణలను చర్చలు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలన్నదే భారత్ విధానమని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఏడు రంగాల్లో వ్యూహాత్మక సహకార ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. యూఏఈ పర్యటనలో భాగంగా ఇంధనం, రక్షణ, మౌలిక సదుపాయాలు, షిప్పింగ్, అధునాతన సాంకేతికత వంటి రంగాల్లో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయని మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇది భారత్–యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపునిచ్చిందని తెలిపారు. భారత్‌లో భారీగా పెట్టుబడులకు యూఏఈ సిద్ధం కావడం రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని వివరించారు. యూఏఈలో సంక్షిప్తమైన, అత్యంత ఫలవంతమైన పర్యటన జరిగిందన్నారు. భారత్–యూఏఈ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై తన సోదరుడు అల్–నహ్యాన్తో చర్చించానని పేర్కొన్నారు. ఈ పర్యటన ఫలితాలు ఇరుదేశాల స్నేహాన్ని మరింత బలోపేతం చేసి, అభివృద్ధి శ్రేయస్సుకు దోహదపడతాయని విశ్వసిస్తున్నట్లు ఉద్ఘాటించారు. అంతకుముందు అబూదాబీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మోదీకి అల్–నహ్యాన్ స్వయంగా స్వాగతం పలికారు. మోదీ పర్యటనకు యూఏఈ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. ఓడల మరమ్మతుల్లో నైపుణ్యాభివృద్ధి భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను పరిరక్షించే బాధ్యత కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజరŠవ్స్ లిమిటెడ్ వ్యూహాత్మక సహకారమే లక్ష్యంగా అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల భారత్‌కు ఇంధన భద్రత చేకూరుతుంది. భారతదేశ పెట్రోలియం నిల్వలను పెంపొందించడంతోపాటు ఎల్ఎన్జీ, ఎల్పీజీ నిల్వలను బలోపేతం చేయడానికి అబూదాబీ సంస్థ సహకరిస్తుంది. ఇండియాకు ఎల్పీజీ దీర్ఘకాలిక సరఫరా, ఆర్థిక స్థిరత్వం, ఇంధన భాగస్వామ్యం లక్ష్యంగా ఎల్పీజీ రంగంలో వ్యూహాత్మక సహకార ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రక్షణ పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేయడం, నూతనఆవిష్కరణలను ప్రోత్సహించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం, జాతీయ, ప్రాంతీయ భద్రతను పటిష్టం చేయడం లక్ష్యంగా వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌పైనా సంతకాలు చేశారు. గుజరాత్లో ఓడ మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి, ఓడరేవులు, తీరప్రాంత మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి మరో ఒప్పందం కుదిరింది. ఓడల మరమ్మతుల్లో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ఇంకో ఒప్పందం కుదుర్చుకున్నారు. భారత్‌లో ఏఐ పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లడమే ధ్యేయంగా ఒక సూపర్ కంప్యూటర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి ఆరో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇండియాలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సంబంధించినది ఏడో ఒప్పందం. మోదీ విమానానికి ఎస్కార్ట్‌గా యూఏఈ యుద్ధ విమానం ప్రధాని మోదీ పట్ల యూఏఈ ప్రభుత్వం తన గౌరవాన్ని చాటుకుంది. మోదీ ప్రయాణిస్తున్న విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత యూఏఈకి చెందిన ఎఫ్–16 యుద్ధ విమానం ఎయిర్‌పోర్టు దాకా ఎస్కార్ట్‌గా వచ్చింది. ఇది భారతీయులందరికీ దక్కిన గౌరవమని మోదీ యూఏఈ అధ్యక్షుడితో చెప్పారు. ఎయిర్‌పోర్టులో తనకు స్వయంగా స్వాగతం పలికిన అల్–నహ్యాన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. -
Europe : వలసల వలలో యూరప్
యూరప్ ను వలసలు చుట్టుముట్టేస్తున్నాయి. ఈ ఖండంలోని చాలా దేశాలు విలవిలలాడిపోతున్నాయి. ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. అల్లర్లు,నేరాలు,ఘోరాలు,అశాంతి ఆ దేశాలను అల్లకల్లోలం చేస్తున్నాయి.వీటికి పరిష్కారం లభించకపోగా,మరింత రగిలే ప్రమాదఘంటికలే వినిపిస్తున్నాయి. వలసలు ఏ ఖండానికి,ఏ దేశానికి కొత్తకాదు.ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చినవారితోనూ, సక్రమంగా వలస వచ్చినవారితోనూ సమస్యలు పెరుగుతూనే వున్నాయి.భారతదేశం కూడా అందుకు మినహాయింపు కాదు. వలసలతో అశాంతి ప్రస్తుత అంశం యూరప్ విషయానికి వస్తే, వలసలు ప్రబలి,రోజుకొకరకమైన దుర్వార్త అక్కడి నుంచి వినాల్సివస్తోంది.ఇప్పటికే ఫ్రాన్స్ లో అల్లర్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. నెదర్లాండ్ లో ప్రభుత్వమే కూలిపోయింది.స్వీడన్ లో ఘర్షణలు లేని రోజంటూ లేదు. స్విట్జర్లాండ్ లో అశాంతి రాజ్యమేలుతోంది. బెల్జియం,జర్ననీలో అల్లర్లు,నేరాలుఘోరాలకు అదుపే లేదు.మానవతా దృక్పధంతో శరణు ఇచ్చినందుకు యూరప్ మొత్తం మూల్యం చెల్లించాల్సి వస్తోంది.శరణుకోరి ఆయా దేశాలలో ప్రవేశించినవారి సంఖ్య కోట్లకు చేరుకుంది.వీరంతా మిగిలిన సామాజిక సమస్యలను సృష్టించడమే గాక,రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు.ప్రభుత్వాల మనుగడే ప్రశ్నార్ధకమవుతోంది. శరణార్థుల దారి యూరపే.! యుద్ధాలు, అంతర్యుద్ధాల కారణంతో యుగొస్లావియా, ఉక్రెయిన్,సిరియా,ఆఫ్ఘనిస్థాన్ మొదలైన దేశాలలో బాధపడేవారు యూరప్ దేశాల వైపు వస్తున్నారు. అతి ప్రమాదకరమైన విధానాల్లో సముద్ర ప్రయాణాలు చేస్తూ, కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.ముఖ్యంగా 2015లో వలసలు పెద్దఎత్తున పోటెత్తాయి.ఆ సంవత్సరాన్ని 'వలసల సంవత్సరం'గా అభివర్ణించారు.2007-2011మధ్య కూడా వలసలు పెద్ద సంఖ్యలోనే జరిగాయి.ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం పెరగడం కూడా వలసలపైన కీలక ప్రభావం చూపించింది, ఇంకా చూపిస్తూనే వుంది. లక్షల మంది వలస 2022నాటికి వలస వచ్చిన జనాభా చూస్తే, జర్మనీలో 10.9మిలియన్లు, స్పెయిన్ లో 5.4మిలియన్లు, ఫ్రాన్స్ లో 5.3మిలియన్లు,ఇటలీలో 5మిలియన్లు ఉన్నట్లు సమాచారం. ఒక్క 2022లోనే యూరోపియన్ యూనియన్ లో ఆశ్రమం కోరిన వారి సంఖ్య 6,32,430.అందులో ఆమోదం పొందిన వారి సంఖ్య 3.10 లక్షలు.ఇన్నేళ్ల పాటు వచ్చినవారు,వస్తున్నవారిలో అధికారికంగా కంటే అనధికారికంగా వచ్చిన వారి సంఖ్య అంచనాలకు మించి వుంటుంది. లక్షల్లో వలసవస్తున్న వీరిని కొన్ని దేశాలు అడ్డుకుంటున్నాయి. జర్మనీ వంటికొన్ని దేశాలు మాత్రం ఆదుకుంటున్నాయి. నాటి పాపం నేడు అనుభవిస్తున్నారు పశ్చిమాసియా, దక్షిణాసియా, ఆఫ్రికా నుంచి పెద్దసంఖ్యలో వలసలు జరిగాయి. అరబ్ విప్లవం తర్వాత టునీసియా, లిబియా,ఈజిప్ట్,యెమెన్, అల్జీరియా వంటి దేశాల నుంచి వలసలు వెల్లువెత్తాయి. చట్టవిరుద్ధంగా ప్రవేశించినవారిలో ఎక్కువమంది గ్రీస్ ద్వారా వెళ్లినట్లు తెలుస్తోంది.వలసల ప్రభావం ఆర్ధిక, సామాజిక,రాజకీయ వ్యవస్థలపై పడుతోంది.నివాసం,ఉపాధి కల్పించడం ప్రభుత్వాలకు పెనుసమస్యగా మారింది. వివిధ సమాజాల మధ్య సాంస్కృతిక ప్రయాణం పెద్దసవాల్ విసురుతోంది. ప్రస్తుతం యూరప్ లో ప్రముఖంగా కనిపిస్తున్న ఈ జాఢ్యం మిగిలిన ఖండాలలోనూ రేపోమాపో శృతిమించకపోదు. సున్నితం.. కీలకం భిన్న సంస్కృతులకు, మతాలకు నిలయమై,అనేక దాడులకు ఆలవాలమై,ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా అవతరిస్తున్న భారతదేశం వలసల విషయంలో,ముఖ్యంగా మిగిలిన దేశాల నుంచి అక్రమంగా చొరబడిన వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యూరప్ వలసల అంశంపై ప్రపంచ దేశాధినేతలు దృష్టి పెట్టాలి. ఆయా దేశాల అంతర్గత సమస్యలను అరికట్టడంలోనూ, మతోన్మాద ఉగ్రవాదం ప్రబలకుండా చూడడంలోనూ అందరూ కలిసి సాగాలి.యూరప్ అనుభవాలు మిగిలిన ఖండాలకు పెద్దగుణపాఠం కావాలి. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
అదే అసలు కిక్..
చిట్‌చాట్ జీవితం ప్లాన్ చేసుకోకుండా సాగితేనే మజాగా ఉంటుందంటోంది మిస్ యూనివర్సల్ ‘పీస్ అండ్ హ్యుమానిటీ’ రుహి సింగ్. అలా అన్ప్లాన్డ్గా ఉంటేనే లైఫ్‌లో కిక్ ఎంజాయ్ చేయగలమని చెబుతోంది. బంజారాహిల్స్ తాజ్‌కృష్ణలో ప్రారంభమైన ఖ్వాయిష్ ఎగ్జిబిషన్ అండ్ సేల్‌ను రుహిసింగ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ బ్యూటీ క్వీన్‌తో సిటీప్లస్ చిట్‌చాట్.. ..:: శిరీష చల్లపల్లి నేను పుట్టింది, పెరిగింది జైపూర్‌లో. కొన్నాళ్లు ముంబైలో ఉన్నాను. నాకు హైదరాబాద్‌కు రావడం సంతోషంగా ఉంది. ఇదొక రాయల్ సిటీ. నేను 2011 నుంచి బ్యూటీ ఫీల్డ్‌లో అనేక కాంపిటీషన్స్‌లో పాల్గొంటున్నాను. 2012లో మిస్ ఇండియా ఫైనలిస్ట్‌గా కూడా ఎంపికయ్యాను. 145 దేశాలు పోటీ చేసిన మిస్ యూనివర్సల్ ‘పీస్ అండ్ హ్యుమానిటీ’లో బ్యూటీ కిరీటం దక్కించుకోవడం ఆనందంగా ఉంది. బ్రేక్‌ఫాస్ట్ విత్ బిర్యానీ.. నా ఫిట్నెస్ మంత్రం లైఫ్‌స్టైలే. నేను పెద్ద ఫుడీని. బట్టర్, చీస్, నెయ్యి, గ్రిల్డ్ మీట్ ఇవన్నీ నా మెనూలో ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్‌కి బిర్యానీ తింటాను. ఎంత తింటానో అంత వర్కవుట్ చేస్తాను. ఉదయాన్నే జిమ్, సాయంత్రాలు ఎరోబిక్స్ చేస్తుంటాను. ట్రెక్కింగ్‌కి కూడా వెళ్తుంటాను. నా కాళ్లు ఒక దగ్గర ఉండవు. రోజంతా బిజీగా ఉంటాను. అందుకే ఎంత తిన్నా నా ఫిట్‌నెస్‌లో తేడా రాదు. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం టాంగో డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాను. నాగ్ మూవీలో చాన్స్ వస్తే.. తొందర్లోనే నేను వెండితెరపై కనిపించబోతున్నాను. బాలీవుడ్ సినిమాకు సైన్ చేశాను. టాలీవుడ్లో నటించాలని ఆశగా ఉంది. అందుకే తెలుగు కూడా నేర్చుకుంటున్నాను. పూరి జగన్నాథ్ సినిమాలో చేయాలని ఉంది. నాగార్జున సినిమాలో చాన్స్ వస్తే వదులుకోను. నా లైఫ్‌లో ఏదీ ప్లాన్ చేసుకోలేదు. నేను ఇలా కిరీటంతో ఉంటానని ఐదేళ్ల కిందట అనుకోలేదు. ఇంకో ఐదేళ్ల తర్వాత ఎలా ఉంటానో ఊహించలేను. అందుకే నేనేం ప్లాన్ చేసుకోను. అప్పుడే ఎక్సైటెడ్‌గా ఉంటుంది.


